365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 31,2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 10 వ వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ పి. రఘు రామి రెడ్డి తెలిపారు.

రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనున్న వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ B.J. రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎం. రఘునందన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 2014లో ఏర్పాటైనప్పటి నుంచి PJTSAU జాతీయస్థాయిలో అనేక ఉన్నత శిఖరాల్ని అందుకుందని రఘురామిరెడ్డి వివరించారు.

ఈ పదేళ్లలో 5 కొత్త వ్యవసాయ కళాశాలలు, ఒక ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల, 4 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్ని ప్రారంభించినట్లు తెలిపారు. సీట్ల సంఖ్యను 1360 కి పెంచడం జరిగిందన్నారు.

అమెరికాలోని అబర్న్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ లో PG కోర్సు అభ్యసించేందుకు విద్యార్థులకి ఓవర్సీస్ ఫెలోషిప్ అందించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో విశ్వవిద్యాలయం తీసుకున్న చర్యల వల్ల 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో PJTSAU 37 వ స్థానాన్ని సాధించిందని వివరించారు. 2017 లో ICAR ప్రకటించిన ర్యాంకుల్లో PJTSAU జాతీయస్థాయిలో 6వ స్థానంలో నిలిచింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 పరిశోధన స్థానాల ద్వారా అన్ని ప్రధాన పంటల్లో విస్తృత పరిశోధనలు చేపడుతున్నట్లు తెలిపారు. వరి, మొక్కజొన్న, జొన్న, అపరాలు వంటి ప్రధాన పంటల్లో ఇప్పటివరకు 67 నూతన వంగడాలని విడుదల చేశామన్నారు. PJTSAU రూపొందించిన తెలంగాణ సోనా-వరి వంగడం జాతీయస్థాయిలో బాగా ఆదరణ పొందిందని తెలిపారు.

దేశంలోనే తొలిసారిగా PJTSAU డ్రోన్ అకాడమీని నెలకొల్పిందని రఘురామి రెడ్డి వివరించారు. PJTSAU కి చెందిన తాండూర్ కంది GI గుర్తింపును సాధించిందని రఘురామి రెడ్డి తెలిపారు.

వ్యవసాయంలో స్టార్టప్ ల్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన అగ్రి హబ్ మంచి పురోగతి సాధిస్తుందన్నారు. 9 డాట్ కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రాష్ట్ర రైతాంగానికి విస్తృతంగా విస్తరణ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

PJTSAU ఎలక్ట్రానిక్ విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ కలిసి రూపొందించిన ‘రైతు నేస్తం’ అనే ప్రత్యక్ష చర్చా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీ, 2024న ప్రారంభించారని రఘురామి రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ 556 రైతు వేదికల్ని అనుసంధానం చేసి సుమారు లక్ష 30 వేల మంది రైతులకి సలహాలు, సూచనలు అందించామన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో PJTSAU ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పునరంకితం అవుతామని రఘురామి రెడ్డి ప్రకటించారు. 10వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పలువురు రైతులకు, బోధన, బోధనేతర సిబ్బందికి అవార్డులను అందజేయనున్నారు.