365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 27,2025: విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సైకాలజిస్టుల నియామకమే మార్గమని లయన్స్ క్లబ్ 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి, డా. హిప్నో పద్మా కమలాకర్ అన్నారు.
విద్యార్థుల్లో పెరిగిపోతున్న ఆత్మహత్యలు, మానసిక ఒత్తిడులపై కేంద్రంగా ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోడా.హిప్నో కమలాకర్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో ముఖ్యమైన సమావేశం శనివారం ఉదయం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ 320A డిస్ట్రిక్ట్ గవర్నర్ డా. మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల దేశం సున్నితంగా స్పందించాలన్నారు.

విద్యార్థులు బాగుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో హిప్నో కమలాకర్ ఏన్నో ఉద్యమాలు చేస్తే విద్యాసంస్థల్లో సైకాలజిస్టుల నియామకం అత్యవసరమని గుర్తించి సుప్రీంకోర్టు మార్చి8, 2009లో జోవో నెంబర్ 19ని తప్పనిసరి చేస్తూ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇప్పటివరకు డా.హిప్నో కమలాకర్ 20వేలకు పైగా పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ, ప్రతి పాఠశాల, కళాశాలలో సైకాలజిస్టులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .ఇది విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఆత్మహత్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై డా. కమలాకర్ చేసిన కృషి ఎంతో అమోఘమైనదని చెప్పారు. “విద్యార్థులు ఎదుర్కొంటు న్న మానసిక సమస్యలు తీవ్రమైనవి. వాటిని పరిష్కరించడానికి సామాజిక సంస్థలతో పాటు విద్యా సంస్థలు, ప్రభుత్వం కలిసి పని చేయాలన్నారు.
లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది” అని డాక్టర్ రెడ్డి అన్నారు.
ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ, “ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని విద్యా సంస్థల్లో సైకాలజిస్టుల నియామకం చేపట్టాలని కోరారు.

అవసరమైతే దేశవ్యాప్తంగా మౌనదీక్షలు, ప్రజా ఉద్యమాలు కూడా చేస్తాం” అని హెచ్చరించారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు గంభీరంగా మారుతున్నా యన్నారు. అవగాహన లేక, సాయం అందని పరిస్థితుల్లోనే ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఉండి అనాధలు గా మారుతుంది విద్యార్థులేనన్నారు. రేపటి తరానికి బాటలు వేసే పౌరులను అందరూ కలిసి కాపాడుకుందాం రండి అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సైకాలజిస్టులు, సి.హెచ్.గోపాల కృష్ణ , జి.కృష్ణవేణీ, డా.వి.జే.క్యార్లిన్, సంఘం ప్రధాన కార్యదర్శి డా.జి.వీరభధ్రం, జి.లక్ష్మి, జయశ్రీ, ఉషశ్రీ ,నిపుణులు పాల్గొని, విద్యార్థులు మానసిక సమస్యలు, పరిష్కార మార్గాలపై విశ్లేషణ జరిపారు.