Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 17, 2024: ప్రీమేచ్యూ రిటీపై అవగాహన పెంచడానికి “ప్రీమేచ్యూరిటీ అవేర్‌నెస్ వాక్” పేరిట పుష్పగిరి విట్రియో రెటినా ఇన్‌స్టిట్యూట్ (పివిఆర్ఐ) శనివారం పరేడ్ గ్రౌండ్స్ నుంచి వెస్ట్ మారేడ్‌పల్లి వరకు అవేర్‌నెస్ వాక్ ను నిర్వహించింది. ఈ వాక్ ప్రపంచ ప్రేమేచ్యూరిటీ దినోత్సవం సందర్భంగా నవంబర్ 17ను పురస్కరించుకుని ఏర్పాటైంది.

ప్రభుత్వ సహకారంతో విస్తృత సేవలు..

పివిఆర్ ఐ, జాతీయ ఆరోగ్య మిషన్ (RBSK విభాగం) సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 20కి పైగా జిల్లాల్లోని ప్రభుత్వ నవజాత శిశు ICUలలో రెటినోపతి ఆఫ్ ప్రీమేచ్యూరిటీ (ROP) స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. ఈ సేవలు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా లభించడంతోపాటు, రోగులకు ఎటువంటి ఖర్చు ఉండదు.

ROP వల్ల ఉన్న ప్రమాదం..

ROP అనేది నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో కనిపించే కంటి వ్యాధి. పుట్టిన 30 రోజులలోపు స్క్రీనింగ్ చేయడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. సరైన సమయంలో చికిత్స అందించకపోతే శాశ్వత అంధత్వానికి దారితీసే ప్రమాదం ఉంది.

సైట్ 4ఆల్ ప్రాజెక్ట్..

పివిఆర్ ఐ “Sight4all ప్రాజెక్ట్” ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20 జిల్లాల్లో 6,000 మందికిపైగా శిశువులను పరీక్షించి, 150 మందికి పైగా పిల్లలకు ఉచిత చికిత్స అందించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కాగ్నిజెంట్ ఫౌండేషన్ మద్దతుతో అమలు చేయబడుతోంది.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు..

పివిఆర్ ఐ గ్రూప్ చైర్మన్ ఆర్.గోవింద్ హరి, సిఎఫ్ఓ గౌరి గోవింద్ హరి, ఆర్ఓపి ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ బాల విద్యాధర్, పీడియాట్రిక్ రెటీనా సర్జన్ డాక్టర్ సాయి కిరణ్మయి, రెటీనా సర్జన్ డాక్టర్ ఓ. మురళీధర్, కాగ్నిజెంట్ ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ నేహా రిచారియా తదితరులు పాల్గొన్నారు.

మద్దతు అందిస్తున్న కాగ్నిజెంట్ ఫౌండేషన్..

కాగ్నిజెంట్ ఫౌండేషన్ ఈ ప్రాజెక్ట్‌కు అర్థిక సహాయం అందించడంతో పాటు, అత్యాధునిక రెటీనా ఇమేజింగ్ పరికరాలు కూడా అందించింది. ఈ సహకారంతో పివిఆర్ ఐ రెటీనా సంబంధిత సమస్యలకు సకాలంలో చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రారంభించిన ప్రాజెక్ట్ లక్ష్యం..

నెలలు నిండక పుట్టిన శిశువుల్లో అంధత్వాన్ని పూర్తిగా నివారించడం, వారికి సమయానుకూలమైన వైద్య సహాయం అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.

error: Content is protected !!