365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 12,2022:ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్లో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, నాణ్యత బాగుందంటూ పలువురు విద్యార్థులు సైతం ప్రశంసించారని కళాశాల ప్రిన్సిపాల్ డా. టి.నారాయణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐఎస్ఎఫ్‌కు చెందిన కొందరు నాయకులు ముందస్తు అనుమతి లేకుండా కళాశాలలోనికి ప్రవేశించారని, ప్రధాన ద్వారం వద్ద బలవంతంగా విద్యార్థులను పోగుచేసి ఆందోళన చేయించారని పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు అందించిన వినతిపత్రంలో పలు ఆరోపణలు చేశారని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. వాస్తవ వివరాలను తెలియజేశారు.
*కళాశాలలోని విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు, హాస్టల్ విద్యార్థుల రక్షణ కోసం, బయటి వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా చూసేందుకు ఎస్వీ యూనివర్సిటీ గేట్ వద్ద, ఎల్ఐసి రోడ్ గేట్ వద్ద రెండు గోడలు నిర్మించారు.
*కళాశాల ఫీజులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది.
*డెయిరీ సైన్స్, సంస్కృత సబ్జెక్టులకు అతిథి అధ్యాపకులను నియమించడం జరిగింది. ఇతర సబ్జెక్టులకు త్వరలో అతిథి అధ్యాపకులను నియమించడం జరుగుతుంది.
*ప్రిన్సిపాల్‌కు పిఏగా వ్యవహరిస్తున్న వ్యక్తిని బోటనీ విభాగానికి పంపడం జరిగింది. ఆ వ్యక్తి స్థానంలో మరొకరిని నియమించడం జరిగింది.
*గ్రంథాలయం సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. లైబ్రేరియన్ నియామకానికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. త్వరలో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు తెప్పించడం జరుగుతుంది.
*కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు విజిలెన్స్ సిబ్బంది, వార్డెన్, డెప్యూటీ వార్డెన్లతో సదరు విద్యార్థి సంఘ నాయకులు దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడాన్ని ప్రిన్సిపాల్ తీవ్రంగా ఖండించారు.