365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,12జూలై, 2021:హైదరాబాద్ కు చెందిన గ్రావ్ టన్ మోటార్స్ తయారుచేసిన క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ గంటకి 70 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది.తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేసేలా హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్ కు చెందిన గ్రావ్ టన్ మోటార్స్ తయారుచేసిన క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ గంటకి 70 కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది. వేగంగా నడిచే ఎలక్ట్రిక్ బైక్ ల విభాగంలో దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి బైక్ అని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.99,000. ఒక సారి ఛార్జీ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రూ.80కు 800 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని.. అంటే కిలోమీటరుకు అయ్యే వ్యయం 10 పైసలు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 5,000 బైక్ లను విక్రయించాలని గ్రావ్ టన్ టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపిన కంపెనీ.. అక్టోబరు నుంచి ఈ బైక్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెట్రోల్ ధరలు పెరగటంతో అంతా విద్యుత్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. అదే క్రమంలో ప్రభుత్వాలు సైతం విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం…

ఈ క్రమంలో పవినియోగదారుల ఆసక్తిని గమనించిన అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. వివిధ రాష్ట్రాల్లో అనేక అంకుర సంస్ధలు విద్యుత్ వాహనాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలోనే హైద్రాబాద్ కు చెందిన అంకుర సంస్ధ గ్రావ్ టన్ మోటార్స్ తన తొలి విద్యుత్ వాహనాన్ని మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి క్వాంటాగా పేరు పెట్టిన సదరు సంస్ధ భద్రతకు ప్రాధాన్యత నిస్తూ ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని రూపొందించినట్లు కంపెనీ సీఈఓ పాక పరశురామ్ తెలిపారు. రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల ప్రయాణం అనే లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తమ ఆన్‌లైన్ వెబ్‌సైటు ద్వారా బుకింగ్‌లు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సగటున 120 కిలోమీటర్ల కన్నా అధికంగా ప్రయాణించాలని మా సర్వేలో తేలింది. అందుకు తగ్గట్టుగానే ఈ వాహనాన్ని రూపొందించామన్నారు. క్వాంట్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వీలుంటుంది.

ధర రూ.99వేలు…
లి ఐయాన్ బ్యాటరీని రిబ్ డ్ ఛాసిస్ తో బిగించారు. దీని వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదని కంపెనీ ప్రకటించింది. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా బీఎల్ డీసీ మోటార్ ను వినియోగించారు. ఇది 3కిలో వాట్ శక్తిని విడుదల చేస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్లాంటులో నెలకు 2,000 యూనిట్లు తయారీ సామర్థ్యం ఉందని, దీన్ని విస్తరించి, 5,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీని ధర రూ.99,000లుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. మార్కెట్లోకి విడుదల చేసిన క్వాంటా కొనుగోలు దారులను ఇట్టే ఆకట్టుకుంటుందని కంపెనీ భావిస్తోంది. ఆన్ లైన్ ద్వారా కంపెనీ బుకింగ్ లను ప్రారంభించినట్లు తెలిపింది.