365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 21, 2024: ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, ఆయిల్ అండ్ గ్యాస్, వైద్య రంగాలకు సంబంధించి అత్యాధునిక హై ప్రెసిషన్, లైఫ్ క్రిటికల్ ఉత్పత్తులను తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రఘువంశీ గ్రూప్ హైదరాబాద్ నగరంలో తన నూతన అత్యాధునిక కర్మాగారానికి శంకుస్థాపన చేసింది.
15 ఒరిజినల్ పరికరాల ఉత్పత్తిదారుల (ఓఈఎం) కోసం ప్రత్యేక తయారీ బేలను కలిగి ఉండి.. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అత్యాధునిక సౌకర్యాన్ని నిర్మించడానికి కంపెనీ రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ ఏరోస్పేస్ & డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పిఎ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘువంశీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ మాట్లాడుతూ, “మా ప్రయాణంలో ఈ ముఖ్యమైన మైలురాయిని గుర్తించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ అత్యాధునిక కేంద్రం.. ఉత్పాదక రంగంలో శ్రేష్టత, సుస్థిరత, సృజనాత్మకత పట్ల రఘు వంశీ గ్రూప్ నిబద్ధతను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ పెట్టుబడితో, మా తయారీ, పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను పెంచడమే కాకుండా, రాబోయే మూడేళ్లలో 2000 మందికి ఉపాధి కల్పించడం, తెలంగాణ ఆర్థిక వృద్ధికి దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము” అని తెలిపారు.
కంపెనీ భవిష్యత్తు వృద్ధి మరింత ఆశాజనకంగా కనిపిస్తోంది. గత ఐదేళ్లలో రఘు వంశీ గ్రూపు 35 శాతానికి పైగా సీఏజీఆర్‌తో రూ.2,000 కోట్లకు పైగా ఆర్డర్లు సాధించింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ హార్డ్‌వేర్ పార్కులో రఘు వంశీ సంస్థ 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
మూడు భవనాల్లో 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ రూ .300 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ కొత్త కేంద్రాన్ని ప్రత్యేకంగా ఆర్ అండ్ డి, అసెంబ్లింగ్, ఉత్పత్తి కోసమే కేటాయించారు.
ఐటీపీ ఏరో (స్పెయిన్), రేవ్ గేర్స్ (యూఎస్ఏ), అదానీ డిఫెన్స్, పార్ట్ ఈస్ట్ రోబోటిక్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, జాయింట్ వెంచర్ల ద్వారా రఘువంశీ తన తయారీ సామర్థ్యాలను గణనీయంగా విస్తరించింది. ఈ విస్తరణ వల్ల రఘువంశీ గ్రూప్‌కు మూడు కీలక విభాగాల్లో స్పెషలైజేషన్ లభించింది.
1. హై ప్రెసిషన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ – ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, బోయింగ్, ఈటన్, హాలిబర్టన్, జీఈ హెల్త్ కేర్, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి మెడికల్ ఓఈఎంల కోసం ఏరో-ఇంజిన్ సబ్ అసెంబుల్స్, ఫ్యూయల్ నాజిల్స్, వాల్వ్ యాక్చువేటర్లు, ల్యాండింగ్ గేర్లతో సహా ఖచ్చితమైన భాగాలు, అసెంబ్లింగ్‌లు.
2. బిల్డ్ టు స్పెసిఫికేషన్ – డీఆర్డీవో, ఇస్రో, హెచ్ఏఎల్, బీడీఎల్ లాంటి భారత ప్రభుత్వ సంస్థలకు రాకెట్ మోటార్ కేసింగ్స్, థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్స్, ఎయిర్ బాటిల్స్ లాంటి క్లిష్టమైన సబ్ అసెంబ్లింగ్స్.
3. డీప్ టెక్నాలజీ ఉత్పత్తులు – క్షిపణులు, యూఏవీలకోసం మైక్రో టర్బోజెట్ ఇంజిన్లు, భారత రక్షణ దళాల కోసం లక్ష్య సిమ్యులేటర్లతో సహా అధునాతన ఉత్పత్తులు.