Sat. Dec 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్12, 2024: హైదరాబాద్‌కు చెందిన రఘువంశీ గ్రూప్, బోయింగ్, జీఈ ఏవియేషన్, హనీవెల్, రోల్స్ రాయిస్, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సునిశిత హై-క్రిటికల్ కాంపోనెంట్స్, సబ్-అసెంబ్లీస్, వ్యవస్థలను తయారు చేసే ప్రముఖ టైర్ వన్ తయారీదారు. తాజాగా ఈ సంస్థ యూకేకు చెందిన ప్రఖ్యాత ప్రెసిషన్ మెషినింగ్ సంస్థ పీఎంసీ గ్రూపును 100% కొనుగోలు చేయడం జరిగింది.

ఈ కొనుగోలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన పరిశ్రమలకు అత్యున్నత సునిశిత ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడంలో రఘువంశీ గ్రూప్ సామర్థ్యాలను మరింతగా విస్తరించే వ్యూహాత్మక ముందడుగుగా నిలిచింది. పీఎంసీ గ్రూపు సునిశిత మెషీనింగ్ నైపుణ్యం, హైదరాబాద్‌లోని రఘువంశీ గ్రూప్ ఆధునిక తయారీ సౌకర్యాలతో కలిపి, ఉత్పత్తి అభివృద్ధిలో ఎక్కువ సైనర్జీలను పెంచుతుంది. ఈ భాగస్వామ్యం తక్కువ ఖర్చులో వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు అందించేందుకు తోడ్పడుతుంది.

35 సంవత్సరాల సునిశిత తయారీ అనుభవం కలిగిన పీఎంసీ గ్రూప్, ఎస్ఎల్‌బీ, బేకర్ హ్యూస్, హాలీబర్టన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆయిల్ & గ్యాస్ కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. 100 మంది ఉద్యోగులు, రూ.180 కోట్ల ఆదాయంతో ఈ గ్రూప్ నికెల్ అల్లాయ్స్ లాంటి పదార్థాలలో 6 మీటర్ల పొడవు కలిగిన సంక్లిష్ట భాగాలను తయారు చేయగలదు.

ఈ సదస్సులో, రఘువంశీ గ్రూప్ ఎండి వంశీ వికాస్ మాట్లాడుతూ, “పీఎంసీ గ్రూపును రఘువంశీ కుటుంబంలోకి స్వాగతించడం పట్ల మాకు సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు మా ఉత్పత్తి బలాలను, పీఎంసీ వారి నైపుణ్యాన్ని కలిపి మా అంతర్జాతీయ ఉనికిని విస్తరించడంలో తోడ్పడుతుంది. ఆయిల్ & గ్యాస్ రంగంలో విస్తృత ఉత్పత్తులు అందించేందుకు మార్గం సుగమమవుతుంది” అన్నారు.

ఈ సందర్భంగా, యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ మాట్లాడుతూ, “భారత్-యూకే మధ్య అభివృద్ధి చెందుతున్న వ్యాపార సంబంధాలకు ఈ భాగస్వామ్యం ఒక ముఖ్య ఉదాహరణ. ఈ భాగస్వామ్యం రెండు దేశాల కంపెనీల స్థాయిని మెరుగుపరుస్తుందని మేము ఆశిస్తున్నాము” అన్నారు.

తెలంగాణ పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ, “రఘువంశీ వంటి భారతీయ ఎంఎస్ఎంఈ యూకేలో ప్రఖ్యాత సంస్థ పీఎంసీని స్వాధీనం చేసుకోవడం గొప్ప విషయమే కాదు, భారత పరిశ్రమల అంతర్జాతీయ స్థాయికి చాటి నిలిచిన ఘట్టం” అని అభిప్రాయపడ్డారు.

ఇంతకు ముందే భారత రక్షణ, అంతరిక్ష రంగాల్లో కీలక భాగస్వామ్యం అందిస్తున్న రఘువంశీ గ్రూప్, ఈ కొనుగోలుతో గ్లోబల్ కంపెనీల అవసరాలను తీర్చేందుకు తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది.

error: Content is protected !!