365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 7,2025: ప్రస్తుతం డీబీఎస్ ఇండియాలో ఇనిస్టిట్యూషనల్ బ్యాంకింగ్ గ్రూప్ (IBG) కు హెడ్‌గా ఉన్న రజత్ వర్మ, వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 న డీబీఎస్ సీఈవో సురొజిత్ షోమ్ పదవీ విరమణ అనంతరం, 2025 మార్చి 1 నుంచి డీబీఎస్ బ్యాంక్ ఇండియా సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆమోదం పొందిన ఈ నియామకం డీబీఎస్ గ్రూప్ మేనేజ్‌మెంట్ కమిటీలో వర్మకు కీలక స్థానం కల్పించనుంది.

2015లో డీబీఎస్ ఇండియా సీఈవోగా బాధ్యతలు చేపట్టిన షోమ్ నేతృత్వంలో డీబీఎస్ భారత విభాగం గణనీయంగా విస్తరించింది. 2016లో దేశంలో మొట్టమొదటి మొబైల్ బ్యాంకింగ్ సర్వీస్ డిజిబ్యాంక్ ప్రారంభించడమే కాకుండా, 2019లో భారతీయ విభాగాన్ని సబ్సిడరీగా మార్పు చేయడం, 2020లో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను విలీనం చేయడం వంటి అనేక కీలక నిర్ణయాలకు ఆయన సారథ్యం వహించారు.

ప్రస్తుతం డీబీఎస్ బ్యాంక్ ఇండియా 19 రాష్ట్రాల్లో 350 కంటే ఎక్కువ బ్రాంచ్‌లతో భారత మార్కెట్లో తన కదలికలను వేగవంతం చేస్తోంది. 2020 నుంచి 2022 వరకు వరుసగా ఫోర్బ్స్ జాబితాలో భారత్‌లో టాప్ 3 బెస్ట్ బ్యాంక్‌లలో డీబీఎస్ చోటు దక్కించుకుంది.

రజత్ వర్మ – అనుభవం, ప్రత్యేకత
27 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం ఉన్న రజత్ వర్మ, ట్రాన్సాక్షనల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, సస్టైనబుల్ ఫైనాన్స్, ఎస్‌ఎంఈ బ్యాంకింగ్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించారు.

2023 జూన్‌లో డీబీఎస్‌కి చేరినప్పటి నుంచి ఐబీజీ విభాగాన్ని విజయవంతంగా విస్తరించారు. కొత్త కస్టమర్లను చేర్చడమే కాకుండా, ఉన్నత స్థాయి కార్పొరేట్ క్లయింట్లతో సంబంధాలను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

వర్మ నేతృత్వంలో, డీబీఎస్ 2024లో గ్లోబల్ ఫైనాన్స్ నుంచి ‘బెస్ట్ బ్యాంక్ ఫర్ సస్టైనబుల్ ఫైనాన్స్ – ఇండియా’ అవార్డు కూడా అందుకుంది. డీబీఎస్‌కు చేరడానికి ముందు, వర్మ HSBC ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ,కమర్షియల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్‌గా పనిచేశారు.

డీబీఎస్ సీఈవో పియుష్ గుప్తా వ్యాఖ్యలు
“గత 30 ఏళ్లుగా భారత్ మార్కెట్ డీబీఎస్‌కు కీలక కేంద్రంగా ఉంది. సురొజిత్ షోమ్ నాయకత్వంలో, డీబీఎస్ ఇండియా ఇనిస్టిట్యూషనల్ బ్యాంకింగ్, వెల్త్ ,రిటైల్ విభాగాల్లో ఫుల్-సర్వీస్ ప్లాట్‌ఫాంగా మారింది. బ్యాంకును ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషికి ప్రశంసలు.

రజత్ వర్మ బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం కలిగిన వ్యక్తి. డీబీఎస్ ఇండియా ఐబీజీ విభాగం 18 నెలల క్రితమే ఆయన నాయకత్వంలో దూసుకుపోయింది. డీబీఎస్ సార్వత్రిక వృద్ధి గాథలో వర్మ కీలక పాత్ర పోషిస్తారని నమ్ముతున్నాను.

భవిష్యత్ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో, డీబీఎస్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో రజత్ విజయవంతం అవుతారని విశ్వసిస్తున్నాను,” అని డీబీఎస్ గ్రూప్ సీఈవో పియుష్ గుప్తా అన్నారు.