365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 10,2024: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘హరికథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నట కిరీటి సంచలన కామెంట్స్ చేశారు.

“ఈ కాలంలో వస్తున్న సినిమాలు, వాటి కథలు మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న కాక మొన్న చూశాం. ఎవడో చందనపు దుంగల దొంగ… వాడు హీరో. ఇటీవ‌లే హీరో పాత్రలకు అర్థాలు మారిపోయాయి. నాకు ఉన్న అదృష్టం ఏంటంటే… నేను 48 ఏళ్లుగా సమాజంలో చుట్టూ ఉన్న క్యారెక్టర్స్‌తోనే విలక్షణ హీరో అనిపించుకున్నాను” అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ కామెంట్స్ ‘పుష్ప-2’ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని ఉద్దేశించి చేశారని భావిస్తున్నారు.

ఇక ‘హరికథ’ వెబ్ సిరీస్ ఈ నెల 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మ్యాగీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో రాజేంద్ర ప్రసాద్‌తో పాటు హీరో శ్రీరామ్‌, పూజిత పొన్నాడ్‌, దివి, అర్జున్ అంబటి, మౌనిక రెడ్డి తదితరులు నటించారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.