365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, ఏప్రిల్ 6,2022: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 7.10 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు రథాన్ని అధిరోహించి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు