365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 13,2024: రాయదుర్గం టిడిపి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నగరంలో వైసీపీ నేతల ర్యాలీని దగాకోరుల దండయాత్రగా అభివర్ణించారు.
వైసీపీ పాలనలో రైతులు తమ హక్కుగా పొందాల్సిన పంటనష్టం పరిహారం లేకుండా నిర్లక్ష్యం చేయబడుతున్నారని ఆయన ఆరోపించారు. 2019 జూన్‌లో అసెంబ్లీ సాక్షిగా పంటనష్టం పరిహారంపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అది అమలు చేయకుండా మాటలతో ఊరించినట్లు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా రైతుల కోసం ఒక్కరూ గొంతెత్తలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో రైతాంగానికి ఎలాంటి సహాయాన్ని అందించిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.
అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితులను గుర్తించిన తొలి సీఎం చంద్రబాబునాయుడు అని, ఇన్‌పుట్ సబ్సిడీ అందించి రైతులకు సహాయం చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. 2014-19 మధ్య మూడేళ్లపాటు రైతులకు సాయం అందించామని, హంద్రీ-నీవా పనులను 30 శాతం పూర్తి చేయగలిగామని, జగన్ వాటిని ఆపేశారని ఆరోపించారు.
HLC ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పెట్టారో జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డిని మోసగాడిగా అభివర్ణిస్తూ, వైసీపీ నేతలు కలెక్టరేట్ ముందు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రైతుల నుంచి ధాన్యం కొన్న వెంటనే 24 గంటల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, రైతాంగానికి సహాయం చేయడంలో టీడీపీ నిరంతరం ముందుంటుందని ప్రకటించారు.