365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 17,2026: తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వేళ హైదరాబాద్‌ నగరం ఖాళీ అయ్యింది. సొంతూళ్ల బాట పట్టిన ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి NH-65 జనసంద్రమైంది. గత ఐదు రోజులుగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అసాధారణ రీతిలో పెరిగాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద నమోదైన గణాంకాల ప్రకారం.. కేవలం ఐదు రోజుల్లోనే 3.04 లక్షల వాహనాలు రాకపోకలు సాగించి సరికొత్త రికార్డును సృష్టించాయి.

భాగ్యనగరం నుంచి ఏపీ వైపునకే అధికం..

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఈసారి గణనీయంగా పెరిగింది. మొత్తం 3.04 లక్షల వాహనాల్లో దాదాపు 2.04 లక్షల వాహనాలు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లినవే కావడం విశేషం. గతేడాది పండుగకు ముందు మూడు రోజుల్లో 2.07 లక్షల వాహనాలు ప్రయాణించగా.. ఈసారి ఆ సంఖ్య మూడు లక్షల మార్కును దాటేసింది.

శనివారం.. వాహనాల హడావుడి..!

పంతంగి టోల్‌ప్లాజా వద్ద ప్రతిరోజూ రద్దీ కొనసాగినప్పటికీ, శనివారం నాడు ప్రయాణం పతాక స్థాయికి చేరింది.

ఇదీ చదవండి..జీర్ణకోశ వైద్యంలో విప్లవం: ఏఐజీలో ‘సెంటర్ ఫర్ మైక్రోబయోమ్ రీసెర్చ్’ ప్రారంభం..

Read this also..Wipro Q3 Results: Profit Dips to Rs.31.2 Billion, But Margins Hit Multi-Year High

శనివారం: అత్యధికంగా 71,284 వాహనాలు

ఆది, మంగళవారాల్లో: 62 వేల చొప్పున..

సోమవారం: 56 వేల వాహనాలు

శుక్రవారం.. 53 వేల వాహనాలు ప్రయాణించాయి. బుధవారం భోగి పండుగ కావడంతో ప్రయాణికులు అప్పటికే గమ్యస్థానాలకు చేరుకోవడంతో రహదారిపై రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది.

టోల్‌ప్లాజాల వద్ద ముందస్తు ఏర్పాట్లు..

విజయవాడ హైవేపై ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పంతంగి, కోరటకల్ టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ‘ఫాస్టాగ్‌’ స్కానింగ్‌ను వేగవంతం చేశారు. దీనివల్ల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ వాహనాలు పెద్దగా నిలవకుండా సాఫీగా సాగిపోయాయి.

ప్రత్యామ్నాయ మార్గాల వైపు..

ప్రయాణికులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం రద్దీ తగ్గడానికి దోహదపడింది. సాగర్ హైవే.. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు వెళ్లే వారు నాగార్జున సాగర్ రహదారిని ఎంచుకున్నారు. చిట్యాల మార్గం..ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వారు భువనగిరి-చిట్యాల మీదుగా ప్రయాణించి ప్రధాన హైవేపై ఒత్తిడిని తగ్గించారు.

ఇదీ చదవండి..ఖజానా నిండుగా.. బకాయిలు మెండుగా: తెలంగాణలో ఆల్కోబెవ్ పరిశ్రమ ఆవేదన..

Read this also..Telangana Alcobev Industry in Crisis: Pending Dues Cross Rs.3,900 Crore Mark..

సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిన హైవేలు.. పండుగ సందడిని ప్రతిబింబిస్తున్నాయి. తిరిగి ప్రయాణం ప్రారంభమయ్యే సమయంలోనూ ఇదే స్థాయి రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.