Fri. Oct 11th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 17,2024 : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేష్ లడ్డూ వేలం సందర్భంగా రికార్డ్ ధర పలికింది. ఈ సంవత్సరపు గణేష్ లడ్డూ వేలంలో, లడ్డూ రూ.1.87 కోట్లు పలకడం విశేషం.

గతంలో, హైదరాబాద్ గణేష్ లడ్డూ వేలం అంటే అందరికీ బాలాపూర్ గణనాథుడి లడ్డూ ప్రసాదమే గుర్తుకువస్తుంది. గత ఏడాది, బాలాపూర్ వినాయకుడి లడ్డూ రూ.27 లక్షలకు అమ్ముడుపోయింది. అయితే, ఈ సంవత్సరం రికార్డులే తిరగరాసినట్టు అనిపిస్తుంది.

ఇక, ఐటీ కారిడార్ పరిధిలోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లోని వినాయకుడి లడ్డూ రూ.29 లక్షలకు అమ్ముడైంది. ఈ వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వ్యాపారవేత్త కొండపల్లి గణేశ్ ఈ ధర చెల్లించి లడ్డూను దక్కించుకున్నాడు.

అలాగే, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాలలోని గణేశ్ లడ్డూ రూ.12.16 లక్షలకు అమ్ముడైంది. ఈ వేలంలో గ్రామానికి చెందిన హరికిషన్ రెడ్డి లడ్డూను కొన్నాడు. గతేడాది, బాలాపూర్ వినాయకుడి లడ్డూ రూ.27 లక్షలకి అమ్ముడైనప్పుడు, మైహోం భుజా లడ్డూ రూ.25.50 లక్షలకు అమ్ముడైనట్లు సమాచారం. ఈసారి, కీర్తి రిచ్ మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూ వేలం అన్ని రికార్డులను అధిగమించింది.

బాలాపూర్ శోభాయాత్ర హుస్సేన్ సాగర్‌కు సుమారు 21 కిలో మీటర్ల దూరం నుండి తరలిస్తారు. ఈ శోభాయాత్ర రాష్ట్రమంతా ఆసక్తి కలిగిస్తుంది. వేలం తరువాత, శోభాయాత్ర బాలాపూర్, కేశవగిరి, చాంద్రాయణ గుట్ట మీదుగా చార్మినార్‌, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్‌, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ వై జంక్షన్‌ మీదుగా హుస్సేన్ సాగర్‌కు చేరుకుంటుంది. ఈ శోభాయాత్రను పర్యవేక్షించేందుకు 733 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!