365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యుస్,ఢిల్లీ, జూలై 8,2021:తిప్పతీగ వాడడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ హెపటాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ఆధారంగా పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ అని సాధారణంగా పిలిచే టినోస్పోరా కార్డిఫోలియాని వాడడం వల్ల ముంబైలో ఆరుగురు రోగుల కాలేయాలు దెబ్బ తిన్నాయంటూ ఒక మీడియాలో కథనాలు వచ్చాయి. దీనికి స్పందించిన అయ్యుష్ మంత్రిత్వశాఖ ఈ వార్తలు తప్పుదోవ పట్టించే విధంగా సరైన ఆధారాలు లేకుండా ప్రచురితం అయ్యాయని పేర్కొంది.
తిప్పతీగ వినియోగంపై నిర్వహించిన అధ్యయనాలు సరైన పద్ధతిలో జరగలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఫలితాలను కూడా క్రమపద్ధతిలో పొందుపరచలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎంతోకాలం నుంచి ఆయర్వేద వైద్య విధానంలో తిప్పతీగను వినియోగిస్తున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాలేయాన్ని తిప్పతీగ దెబ్బ తీస్తుందని జరుగుతున్న ప్రచారం సంప్రదాయ భారతీయ వైద్య విధానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అధ్యయన వివరాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ విశ్లేషించింది. రోగులు వాడిన తిప్ప తీగ గుణాలను పరిశోధకులు గుర్తించలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ తన వివరణలో పేర్కొంది. రోగులు కేవలం తిప్ప తీగను మాత్రమే ఉపయోగించారా లేదా ఇతర మూలికలను కూడా ఉపయోగించారా అన్న అంశాన్ని పరిశోధకులు గుర్తించవలసి ఉంటుందని ఆయుష్ శాఖ వ్యాఖ్యానించింది. తమ వాదనకు బలం చేకూర్చడానికి పరిశోధకులు ఆయుర్వేద నిపుణులను కాకుండా వృక్ష శాస్త్ర నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నారని పేర్కొంది.
వినియోగించిన మూలికను సరిగ్గా గుర్తించకుండా జరిగే అధ్యయనాలు సరైన ఫలితాలను ఇవ్వవని హెచ్చరిస్తూ గతంలో వెలువడిన నివేదికలను ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. తిప్ప తీగ మాదిరిగానే ఉండే మరో మూలిక కాలేయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. మార్గదర్శకాలను పాటిస్తూ మూలికలను గుర్తించి అధ్యయనాలను నిర్వహిస్తే సరైన ఫలితాలు వస్తాయని, అయితే, తిప్ప తీగపై జరిగిన అధ్యయనాల్లో ఇది జరగలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ వివరించింది. ఇంతేకాకుండా, ఈ అధ్యయనాల్లో అనేక లోటుపాట్లు చోటుచేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంత మోతాదులో రోగులు తిప్ప తీగను తీసుకున్నారు లేదా ఇతర ఔషదాలతో కలిసి దీనిని తీసుకున్నారా అన్న అంశంపై స్పష్టత లేదని ఆయుష్ శాఖ వివరించింది. అధ్యయనాలను నిర్వహించడానికి ముందు రోగుల వైద్య రికార్డులను కూడా పరిశోధకులు పరిశీలించలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సరైన సమాచారం లేకుండా ప్రచురించే ప్రచురణల వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందని దీనివల్ల పురాతన భారతీయ ఆయుర్వేద వైద్య విధానంపై ప్రభావం చూపుతాయని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆవేదన వ్యక్తం చేసింది.
తిప్ప తీగ లాంటి మూలికలు కాలేయం సక్రమంగా పనిచేసే చూస్తాయని గతం జరిగిన పరిశోధనలు వెల్లడించాయని ఆయుష్ మంత్రిత్వశాఖ గుర్తు చేసింది.కేవలం తిప్ప తీగపై మాత్రమే ఈ అంశంపై 169కి పైగా పరిశోధనలు జరిగాయని ఇవన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని ఆయుష్ శాఖ వివరించింది. ఇదేవిధంగా, టి. కార్డిఫోలియా మరియు సమర్థతపై 871కి పైగా వివరాలను పొందవచ్చునని ఆయుష్ శాఖ పేర్కొంది.ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే తిప్ప తీగ భద్రతపై వందలాది పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. కాలేయం సక్రమంగా పనిచేసేలా చూసే గుణాలను తిప్ప తీగ కలిగివుందని దీనివల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏవిధంగా చూసినా తిప్ప తీగపై ఒక పత్రికలో ప్రచురితమైన వార్త వాస్తవాలకు దూరంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆయుష్ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇటువంటి వార్తలను ప్రచురించే ముందు నిపుణులను లేదా తమ సంప్రదించి వారి నుంచి వివరాలను పొందాలని ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించింది.