365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల, జనవరి 26th, 2022: శ్రీవారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ అని టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో బుధవారం ఉదయం 73వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ 1980వ సంవత్సరం తరువాత తిరుమలలో పెద్ద ఎత్తున గదుల ఆధునీకరణ చేపట్టి నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2 వేల వసతి గదుల అధునీకరణ పనులు పూర్తి చేశామని, త్వరలో మరో 1500 గదుల అధునీకరణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. దాతల సహాకారంతో శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు అత్యాధునిక పరకామణి భవనాన్ని జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు.
అదేవిధంగా దాతల సహకారంతో రూ.25 కోట్లతో అలిపిరి నడక మార్గం పైకప్పు నిర్మాణ పనులు పూర్తి చేసి గత ఏడాది అక్టోబరు నుండి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఎస్వీబీసిలో 18 నెలల పాటు ప్రసారం అయిన గీతా పారాయణం కార్యక్రమంకు భక్తుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు భగవద్గీతలోని శ్లోకాలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నేటి యువతకు మన సనాతన హైందవ ధర్మాన్ని, ఆర్ష ధర్మ సాంప్రదాయాలను తెలిపేందుకు టిటిడి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా. శ్రీదేవి, డెప్యూటీ ఈవోలుసెల్వం, లోకనాథం,భాస్కర్, ఎస్టేట్ అధికారి మల్లిఖార్జున్, వీజివో బాలిరెడ్డి, ఇఇలు జగన్మోహన్ రెడ్డి, సురేంద్ర, రవిశంకర్ రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి జీఎల్ఎన్ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.