365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 26,2025: రిపబ్లిక్ డే 2025: 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి, దేశ నిర్మాణానికి చూపించిన శక్తి గత ఏడు దశాబ్దాలుగా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ విజయగాథ వెనుక ఉన్న ప్రధాన శక్తి మన రాజ్యాంగమే. అది మనకు శాశనాలను, కృషిని, పట్టుదలను అందించింది. గత 75 ఏళ్లలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందో చూద్దాం.
పునాది నుంచి పటిష్టత వైపు..
1947లో స్వాతంత్య్రం అందుకున్న భారతదేశం, 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత స్వతంత్ర భారత రూపాన్ని చూసింది. మన మానవ వనరుల బలం ఆధారంగా స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న భారతదేశం, అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా పయనిస్తోంది. ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోంది. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రత్యేక స్థానం దక్కుతోంది.
సార్వత్రిక ఓటు హక్కు..
రాజ్యాంగం అమలు కాగానే, 1950 జనవరి 25న ఎన్నికల సంఘంను స్థాపించారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పిస్తూ, 1950, 1951 ఎన్నికల చట్టాలు అమలులోకి వచ్చాయి.
హిందూ కోడ్ బిల్..
1951లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా హిందూ వివాహాలు, వారసత్వ హక్కులపై విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
అస్పృశ్యతపై నిషేధం..
రాజ్యాంగం ద్వారా అస్పృశ్యతను నిషేధించడం జరిగింది. 1955లో పౌరహక్కుల రక్షణ చట్టం, 1989లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులోకి వచ్చాయి.
రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ..
1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ప్రతిపాదనలతో భాష ఆధారంగా రాష్ట్రాల రూపకల్పన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పునాది వేస్తూ పోట్టి శ్రీరాములు దీక్ష చేసిన సందర్భం ప్రస్తావనీయమైనది.
పంచాయతీ రాజ్ చట్టం..
1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామస్వరాజ్‌ను అమలు చేస్తూ, స్థానిక పాలనకు నాంది పలికింది.
సమాచార హక్కు చట్టం..
2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, జవాబుదారీతనం కల్పిస్తూ ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది.
గత 75 ఏళ్లలో రాజ్యాంగం అందించిన హక్కులు, భవిష్యత్ లక్ష్యాలు మన దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇవే కారణాలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాయి.