365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 5, 2024: రక్షణ,విమానయాన రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్న ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ సఫ్రాన్, భారత మార్కెట్లో తన ఉనికిని విస్తరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తో వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, సఫ్రాన్ కంపెనీ భారతదేశ రక్షణ రంగంలో మరింతగా క్రియాశీలకంగా వ్యవహరించనుంది.
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా, రెండు దేశాల మధ్య రక్షణ సహకారం, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో రక్షణ పరిశోధనను బలోపేతం చేయడంతో పాటు, భారత్‌లో స్టార్టప్‌లకు అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా పరిశీలించారు.
రక్షణ ఎలక్ట్రానిక్స్‌పై ప్రత్యేక దృష్టి
సఫ్రాన్ ప్రస్తుతం డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్స్ తయారీపై దృష్టి సారించింది. భారతదేశంలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయాలని సఫ్రాన్ నిర్ణయించింది. ఈ క్రమంలో, భారత రక్షణ దళాలకు అవసరమైన సెన్సార్లు, మైక్రో ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేయడానికి చర్యలు చేపట్టనుంది.
టైరేనియం మిశ్రమం,నికెల్ సూపర్‌లాయ్‌తో తేలికపాటి ఆయుధాలు తయారు చేయడంలో భారత్-ఫ్రాన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అంశాలు ఫ్రాన్స్‌లో జరిగిన చర్చల్లో ప్రధానంగా చర్చించిన అంశాలు. సఫ్రాన్ ప్రస్తుతం హెలికాప్టర్ల సాంకేతికతపై HAL తో కలిసి పనిచేస్తోంది.
హైదరాబాద్‌లో సఫ్రాన్ ఒప్పందం
గత ఏడాది, హైదరాబాద్‌లో జీఎంఆర్ ఏవియేషన్ సెసిల్ సఫ్రాన్ ల్యాండ్ డీల్‌పై సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందం భాగంగా, భారతదేశంలో ఎయిరోస్పేస్ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో, సఫ్రాన్ కంపెనీ భారతదేశ రక్షణ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి అన్ని అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.