365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూన్ 28: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా దోషాలు జరిగినా, ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 30న మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. జూలై 1న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు.
జూలై 2న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.