365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 19, 2023: రఘువంశీ మెషీన్ టూల్స్ (హైదరాబాద్, ఇండియా), రేవ్ గేర్స్ ఎల్ఎల్సీ (టెక్సాస్, అమెరికా) సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన హైద‌రాబాద్‌కు చెందిన స్కంద ఏరోస్పేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఏటీపీఎల్‌) తన అత్యాధునిక గేర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.

ఏరోస్పేస్-స్టాండర్డ్ గేర్లను రూపొందించడానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ త‌యారీకేంద్రం ఏర్పాటైంది. ఇది దేశంలో ఏరోస్పేస్ ఉత్ప‌త్తుల‌ను పెంచడంలో ఒక ఆశాజనకమైన దశను సూచిస్తుంది.

ఈ అధునాతన కేంద్రం ప్రారంభోత్స‌వ కార్యక్రమంలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జయేష్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పి.ఎ. త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రఘువంశీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ మాట్లాడుతూ, “స్కంద ప్రారంభోత్సవం భారతదేశపు ఏరోస్పేస్, రక్షణ రంగ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, కీలకమైన రంగాలలో దేశం స్వావలంబనకు దోహదపడే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శ్రేష్ఠత పట్ల స్థిరమైన నిబద్ధతతో, స్కంద చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయత్నం కంపెనీకి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచించడమే కాకుండా, ఏరోస్పేస్ సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశపు స్థిరమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

రక్షణ, విమానయాన రంగాల్లో దేశం పురోగతి సాధిస్తున్న తరుణంలో, స్కంద నుంచి వ‌స్తున్న ఈ స‌రికొత్త‌, అధునాతన ప్లాంటు భారతదేశంలో, ప్రపంచ వేదికపై ఏరోస్పేస్ తయారీ భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందనే వాగ్దానాన్ని కలిగి ఉంది” అని చెప్పారు.

స్కంద దార్శనిక దీక్షకు తెలంగాణ ప్రభుత్వ ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జయేష్ రంజన్ త‌న సంపూర్ణ మద్దతు తెలిపారు. “ఏరోస్పేస్ గేర్ తయారీలో స్కంద వినూత్న విధానం రక్షణ, విమానయాన రంగాల్లో భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది. స్థానిక, అంతర్జాతీయ ఏరోస్పేస్ పరిశ్రమలపై ఈ ప్లాంటు క‌ల‌గ‌జేసే సానుకూల ప్రభావాన్ని చూడటానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పి.ఎ, ఖచ్చితమైన తయారీని ముందుకు తీసుకెళ్లడంలో స్కంద అచంచలమైన నిబద్ధతను ప్రశంసించారు. “నాణ్యమైన ఏరోస్పేస్ విడిభాగాలను అందించడంలో స్కంద అంకితభావం తెలంగాణలో ఏరోస్పేస్ రంగంపై మా దార్శనికతకు అద్దం పడుతోంది. ఈ ప్రాంతంలో ఏరోస్పేస్ తయారీ భవిష్యత్తును రూపొందించడంలో ఈ ప్లాంటు కీలక పాత్ర పోషించనుంది” అని తెలిపారు.