
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 23,2021:అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఆగస్టు 30 లోగా సానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్ , మున్సిపల్ శాఖ ల మంత్రులు, అధికారులను సిఎం ఆదేశించారు.
విద్యార్థుల పట్ల జాగ్రత్తలు

విద్యాసంస్థలు తెరిచిన తర్వాత స్కూల్లల్లోని విద్యార్థినీ విద్యార్థులకు జ్వర సూచన వుంటే ఆయా స్కూల్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని పిహెచ్ సీ కి తీసుకువెల్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని సిఎం తెలిపారు. వొక వేల కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సిఎం సూచించారు. హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు సానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణా చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని, తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపుతున్న తల్లిదండ్రులను సిఎం కెసిఆర్ కోరారు.

