
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి,అక్టోబర్ 31,2021: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం 6 గంటలకు పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు. అక్టోబరు 31నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
సంవత్సరం పొడవునా ఆలయంలో జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00నుంచి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఆస్థానం జరుగనుంది.