365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 15,2025: భారీ వర్షాల కారణంగా నాలాల్లో పడి గల్లంతైన ముగ్గురి కోసం హైడ్రా (HYDRA) అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అఫ్జల్‌సాగర్, వినోభా కాలనీ నాలాల వద్ద హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్ నాలాలో నివాసం ఉంటున్న మామ అల్లుడు అర్జున్ (26), రాము (25)తో పాటు, ముషీరాబాద్‌లోని వినోభా కాలనీ నాలాలో దినేష్ అలియాస్ సన్నీ (26) గల్లంతయ్యారు.
ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందనతో కలిసి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గాలింపు సందర్భంగా ప్రతి క్యాచ్‌పిట్‌ను తెరిచి చూసి, వెంటనే మూసివేయాలని సిబ్బందికి సూచించారు.
నాలా ఆక్రమణలే ప్రమాదాలకు కారణం:
గాలింపు అనంతరం మీడియాతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాలాల ఆక్రమణల వల్లే వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అక్రమ నిర్మాణాలు, అశాస్త్రీయంగా నాలాల దారి మళ్లింపు వల్ల వరద నీరు సాఫీగా వెళ్లడం లేదని చెప్పారు.

వరద ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఒకటి, రెండు నిర్మాణాలను మాత్రమే తొలగిస్తామని, మిగతావారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పేదల ఇళ్లను తప్పనిసరి పరిస్థితుల్లో కూల్చివేయాల్సి వస్తే, ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి…హైదరాబాద్‌లో 1 ఫైనాన్స్ ఆర్థిక ప్రణాళిక కేంద్రం ప్రారంభం..
ప్రతి ఏటా ఇదే సమస్య:
వర్షాకాలంలో ప్రతి ఏటా ఈ సమస్య పునరావృతమవుతోందని స్థానికులు పేర్కొన్నారు. దీనికి మూలాల నుంచి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కమిషనర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో కలిసి అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్తామని చెప్పారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు మునిగిపోయే అమీర్‌పేట వంటి ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ నాలాల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం వల్ల సమస్య పరిష్కారమైందని వివరించారు. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు 2,200 లారీల పూడికను తొలగించామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.