365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 8,2024: భారత మృత్తికాశాస్త్ర సంఘం, న్యూఢిల్లీ ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక సదస్సులో మృత్తికాశాస్త్ర విభాగంలో PG, PhD విద్యార్థుల ఉత్తమ పరిశోధనలకు జోనల్ స్థాయిలో ,జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటించే ఎంపిక ప్రక్రియను ఈ సంవత్సరానికి గాను భారత మృత్తికాశాస్త్ర సంఘం – హైదరాబాద్ చాప్టర్ నిర్వహించనున్నది.
PG స్థాయిలో అత్యుత్తమ పరిశోధనల కోసం జోనల్ స్థాయిలో, PhD స్థాయిలో అత్యుత్తమ పరిశోధనల కోసం జాతీయ స్థాయిలో అవార్డుల ఎంపిక ప్రక్రియను నిర్వహించడానికి కౌన్సిల్ ఐదుగురు సభ్యులతో కూడిన జడ్జి కమిటీని నియమించింది.
ఈ కమిటీకి, సీనియర్ ప్రొఫెసర్,మృత్తికాశాస్త్ర విభాగం యూనివర్సిటీ హెడ్, భారత మృత్తికాశాస్త్ర సంఘం అధ్యక్షురాలు, వర్సిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జి. జయశ్రీ చైర్మన్ గా, డాక్టర్ కె. పవన్ చంద్రా రెడ్డి (ప్రధాన శాస్త్రవేత్త) మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ కమిటీలో, డాక్టర్ V.B కులిగోడ్ (ధార్వాడ్), డాక్టర్ ఆర్. శ్రీనివాసన్ (బెంగళూరు), డాక్టర్ పి. బాలసుబ్రమణ్యం (కోయంబత్తూర్) సభ్యులుగా ఉన్నారు.
ఈ అవార్డు ఎంపిక ప్రక్రియ మంగళవారం రోజున వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుండి వచ్చిన విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎంపికైన విద్యార్థులకు జాతీయ స్థాయిలో జరిగే వార్షిక సదస్సులో అవార్డులు అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఐసిఏఆర్ సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.