365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి 4,2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా G20 సమావేశాలను పురస్కరించుకొని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో “సుస్థిర వ్యవసాయానికి మెరుగైన పద్ధతులు” అనే అంశంపై శనివారం సెమినార్ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్. జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిలో కర్బన శాతం గణనీయంగా తగ్గిపోయిందని, రైతులు కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడటం కాకుండా వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని అన్నారు.
సుస్థిర వ్యవసాయానికి మెరుగైన పద్ధతులను తెలియజేస్తూ G20 ముఖ్య ఉద్దేశ్యాలపైన దృష్టి సారించాలని తెలిపారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ రైతులకు ఇది ఒక చక్కని అవకాశం అని ఈ అంశంపై వారికి ఏమైనా సందేహాలుంటే శాస్త్రవేత్తలద్వారా నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు.
డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం. వెంకట రమణ మాట్లాడుతూ.. నేల ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, అంతేకాకుండా వనరులన్నింటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి ఉత్పత్తులను నేల నుంచి పొందగలమని లేకపోతే మున్ముందు ఆహారం కొరత ఏర్పడవచ్చని చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ అధికారులు G20 ఏర్పాటు గురించి విపులంగా వివరిస్తూ దాని నేపథ్యం “వసుదైక కుటుంబం” అని, G20 ప్రతినిధుల సభకు భారతదేశం డిసెంబర్ 2022 నుంచి నవంబర్ 2023 వరకు ప్రతినిధిగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కళాజాతల ద్వారా చక్కని సందేశాత్మక నాటికను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో వివిధ సాంకేతిక అంశాలను డాక్టర్ ఏవీ. రామాంజనేయులు, ప్రధాన శాస్త్రవేత్త,హెడ్, ఆగ్రో ఫారెస్ట్రీ,డాక్టర్ టి. రామ్ ప్రకాష్, ప్రధాన శాస్త్రవేత్త, చర్చించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు డాక్టర్ సీమ, డాక్టర్ వి. అనిత, డాక్టర్ రత్నకుమారి, కళాశాల అసోసియేట్ డీన్ సి. నరేంద్ర రెడ్డితదితరులు పాల్గొన్నారు.