Sun. Jun 16th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్ ,మే 4,2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉభయ గోదావరి జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రత్యేకత ఉంది. గతంలో ఆఁధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రమారావుతో సహా ఎందరోమహామహులు పోటీ చేసి విజయం సాధించారు.

మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఉమ్మడి అనంతపురం జిల్లాపై పడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలు అన్నిటిలోనూ పోటీ ప్రధానంగా వైసీపీ -టీడీపీ జనసేన బీజేపీ కూటమి మధ్యే ఉంది. కానీ ఒక్క శింగనమల నియోజకవర్గంలో మాత్రమే ట్రయాంగిల్ పోరు నెలకొంది.

ఇక్కడ అధికారిక వైసీపీ పార్టీ, టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా గట్టి పోటీని ఇవ్వనుంది. ఈ ముక్కోణపు పోరులో ఏ పార్టీ ఓట్లను ఏ పార్టీ చీల్చుతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. శింగనమల నియోజకవర్గం షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) రిజర్వ్‌డ్‌ స్థానం కాగా.

గతంలో ఎన్నికలను పరిశీలిస్తే 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన శైలజానాథ్. అనంతపురం రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారినసమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సాకే శైలజానాథ్ తిరిగి ఆ పార్టీని సరైన గాడిలో పెట్టారు. ఇదిలా ఉంటే.. శైలజానాథ్ శింగనమల నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి మొదటిసారిగా వీరాంజనేయులుపోటీలో నిలుస్తుండగా.. బండారు శ్రావణశ్రీ మరోసారి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు.

సొంత కూటమి నుంచే సహకారం లేదు..

శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణిశ్రీకి ఇంటిపోరు తప్పడంలేదు. అక్కడ ఆమెకు సొంత కూటమి నుంచే సహకరించే పరిస్థితులు కనిపించడంలేదు. గతంలో శింగనమల టీడీపీ సీనియర్ నాయకులు బండారు శ్రావణికోసం గడపగడప తిరిగి ప్రచారం చేశారు. అయితే ఆమె టీడీపీ సీనియర్ నేతలపైనే కేసులు పెట్టడంతో శ్రావణికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని వాళ్ళంతా తేల్చేశారు.

ఇప్పుడు వాళ్లంతా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. దీంతో శ్రావణి గెలుపు కాస్త కష్టంగా మారింది. అంతేకాదు శైలజానాథ్ గట్టిపోటీ ఇవ్వనున్నారు. ఇది టీడీపీకి పెద్ద మైనస్. శైలజానాథ్‌కు ఉన్న పరిచయాలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం కాదు. ఇతర పార్టీల వారితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారు.

కాబట్టి ఇప్పుడు ఇదే ఆయనకు ప్లస్సే అవుతుంది. శ్రావణిని వ్యతిరేకిస్తున్న టీడీపీలోని ఒకవర్గం శైలజానాథ్‌కు మద్దతు ఇస్తున్నామంటూ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో శైలజానాథ్‌కు మద్దతు పెరుగుతుంది.

శింగనమల నియోజకవర్గంలో కీలకంగా మరిన శైలజానాథ్..

శైలజానాథ్ ఇక శింగనమలలో శైలజానాథ్‌కు సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశాలూ ఉన్నాయి. శైలజానాథ్ పోటీ చేస్తే తమకు ఇబ్బందులు తప్పవని తెలుసుకున్న రెండు ప్రధాన పార్టీల నాయకులూ ఆయన్ను వారి వారి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేశాయి. అయితే శైలజానాథ్ మాత్రం తాను కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తానని గట్టిగా తెగేసి చెప్పడంతో శైలజానాథ్ శింగనమల నియోజకవర్గంలో చాలా కీలకంగా మారారు.

ఎట్టకేలకు కాంగ్రెస్ నుంచే 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు శైలజానాథ్. తాను నామినేషన్ వేసిన సందర్భంగా అటు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇతర పార్టీల నాయకులూ శాతం ఆయనతో చాలామంది సెల్ఫీలు కూడా దిగారు.

ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మంత్రిగా శైలజానాథ్ చేసిన అభివృద్ధి కూడా ఆయనకు ఎన్నికల్లో కలిసొచ్చే ప్రధాన అంశం. అదే క్రేజ్ శింగనమలలో మామూలుగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ త్రిముఖ పోటీలో శైలజానాథ్‌ కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మరోసారి ఆయన ఎమ్మెల్యేగా చూడొచ్చని రాజకీయ పండితులు సైతం నొక్కి చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు..

ఇది కూడా చదవండి: 50 కోట్ల ప్యాసింజర్ ప్రయాణాల మైలురాయిని సాధించిన L&TMRHL.