365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 11,2022: గతంలో 35-నుంచి 40 ఏళ్ళు దాటినవారిలోనే ఎక్కువగా జుట్టు నెరిసేది. ఇప్పుటి తరంలో నాలుగదేళ్ల వయసున్న చిన్నారులకు సైతం తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. అయితే తెల్ల వెంట్రుకలు తీసేయ్యడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి..?
అసలు వైట్ హెయిర్స్ ను తొలగించడం వల్ల లాభమా..? నష్టమా..? ప్రతిఒక్కరికీ ఈ అనుమానం కలుగుతుంది. ఒక్క తెల్లవెంట్రుక తొలగిస్తే, దాని చుట్టుపక్కల ఉండే వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయంటారు.
ఇది ఎంతవరకు వాస్తవం…దీనిపై డెర్మటాలజిస్టులు ఏమంటున్నారనే విషయాలు తెలుసుకుందాం..?

ఇలా తక్కువ వయసులోనే వైట్ హెయిర్స్ రావడం అనేదానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఒక్క తెల్లవెంట్రుకను తొలగిస్తే పది వస్తాయనే డౌటు చాలామందిలో ఉన్నది. అంతేకాదు అది కొందరి మనసులో నాటుకుపోయింది.
ఒక్క తెల్లవెంట్రుకను పీకేస్తే, ఆ వెంట్రుక చుట్టుపక్కల ఉన్న నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయనుకుంటారు. ఇది కేవలం అపోహమాత్రమేనని ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
తెల్లవెంట్రుకలను తీసెయ్యడం వల్ల మరిన్ని వైట్ హెయిర్స్ వస్తాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు అంటున్నారు.
మెలనిన్ అనే వర్ణద్రవ్యం అనేది తెల్లవెంట్రుకలకు, నల్లవెంట్రుకలకు మధ్య తేడాను నిర్ణయిస్తుందని డెర్మటాలజిస్టులు వెల్లడిస్తున్నారు. తెల్లవెంట్రుకల్లో మెలనిన్ అనేది ఉండదు. దీనిలోపం వల్లే తెల్లవెంట్రుకలు వస్తాయట. నల్లవెంట్రుకల్లో పూర్తిస్థాయిలో మెలనిన్ ఉంటుంది.
గోధుమరంగు వెంట్రుకల్లో మెలనిన్ యాభైశాతం వరకు ఉంటుంది. వెంట్రుకలు తలపై ఉన్న రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఎపిడెర్మిస్ అని పిలిచే ఉపరితల చర్మం కింద ఉన్న డెర్మిస్ ప్రాంతంలో ఉంటాయి.

అక్కడే మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయిన మెలనిన్, వెంట్రుక గొట్టాల్లోకి చొచ్చుకునివెళ్లి పేరుకుపోతుంది. అందుకే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అయితే కొన్ని వెంట్రుకల కుదుళ్ల వద్ద మెలనిన్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి అవ్వదు.
కాబట్టి ఆ వెంట్రుకలు గోధుమరంగులో గానీ తెల్లగా గానీ మారిపోతుంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో మెలనిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ముసలితనంలో తెల్లవెంట్రుకలు ఎక్కువగా వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు.
మెలనిన్ రేణువులు సాధారణ కాంతితో పాటూ సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను కూడా శోషించుకుని మరింత నల్లగా మారతాయి. చాలా పాశ్చాత్య దేశాల్లో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది.
అందుకే వారి జుట్టు తెల్లగా, గోధుమ రంగులో, తెలుపు నలుపు కలిసి పోయినట్లు కనిపిస్తుంది. దానికి తక్కువ మెలనిన్ ఉత్పత్తే కారణం అని డెర్మటాలజిస్టులు పేర్కొంటున్నారు.

తెల్లవెంట్రుకలను పీకేస్తే పక్కనున్న వెంట్రుకలు తెల్లగా మారతాయనడంలో ఏమాత్రం నిజం లేదని డాక్టర్లు చెబుతున్నారు. మెలనిన్ సరిగా ఉత్పత్తి కాని వెంట్రుకలు మాత్రమే తెల్లగా మారుతాయని అంటున్నారు.
తలపై ఒకేప్రాంతంలో వెంట్రుకలు గుంపులుగా తెల్లగా మారడం వల్ల ఆ అభిప్రాయం జనాల్లో నాటుకుపోయి ఉండొచ్చని, వైట్ హెయిర్స్ ఉన్నప్రాంతంలో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల అక్కడున్న వెంట్రుకలన్నీ తెల్లగా మారిపోతాయని,
అంతే తప్ప తెల్లవెంట్రుకలు తొలగించడం కారణంగా మరిన్ని వస్తాయనుకోవడం కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.