365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,వరంగల్,అక్టోబర్ 14,2022:మా నాన్న నన్ను డాక్టర్ని చేయాలనుకున్నాడు. వరంగల్ ఎల్ బి కాలేజీలో ఇంటర్ లో బైపీసీలో చేర్పించాడు. కానీ నేను పొలిటీషియన్ అయ్యా..మా నాయన రాజకీయాలు మాకు అబ్బినయ్. నేను డాక్టర్ కాకపోయినా, మా నాయన ఎంతోమంది పేదలను చదివించారు. వాళ్లంతా డాక్టర్లు అయ్యారు.
ఆ విధంగా మా నాయన కోరిక నెరవేరింది. అందుకే నాకు డాక్టర్లంటే ఎనలేని అభిమానం. డాక్టర్లను మేము మా కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాం. వరంగల్లో ఫిజీషియన్ డాక్టర్ల సదస్సు దక్షిణ భారత స్థాయిలో జరగడం సంతోషదాయకం. ఇంత గొప్ప కార్యక్రమానికి నేను ముఖ్యఅతిథిగా హాజరవ్వడం గర్వకారణం అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో జరిగిన దక్షిణ భారత ఫిజీషియన్ డాక్టర్ల సదస్సు లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డాక్టర్లు కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్లుగా ప్రజలకు ఎంతో సేవ చేశారని , అందుకే డాక్టర్లను కనిపించే దేవుళ్ళుగా పరిగణిస్తారు. డాక్టర్లు కూడా రోగులకు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ఆయన అన్నారు.
కరోనా సమయంలో ప్రపంచమంతా వణికి పోతుంటే మన రాష్ట్రంలో డాక్టర్లు మాత్రం నిర్భయంగా, ధైర్యంగా కరోనా రోగులకు ట్రీట్మెంట్ ఇచ్చి రక్షించారు. డాక్టర్లు అంటే సీఎం కేసీఆర్ గారికి ఎంతో అభిమానం. డాక్టర్లు తమ వైద్య వృత్తిని పవిత్రంగా భావించాలి. వ్యాపార దృక్పథంతో కాకుండా వైద్యాన్ని సేవా దృక్పథంతో నిర్వర్తించాలి.
తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో వైద్యరంగం ఎంతో అభివృద్ధి చెందింది. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచింది. చిన్నపిల్లల వైద్యంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉంది. వైద్యరంగంలోని వివిధ అంశాల వారీగా ఆరోగ్య సూచీ లను పరిశీలిస్తే మన రాష్ట్రం మొదటి ఐదు స్థానాల్లోనే నిలుస్తోంది. కెసిఆర్ కిట్ లాంటి పథకాలను అద్భుతంగా అమలు చేస్తున్న ఘనత ఈ రంగానిదేనని మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.
తెలంగాణ రావడానికి ముందు రాష్ట్రంలో కేవలం మూడు మెడికల్ కాలేజ్ లు ఉండేవి. ఇవాళ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటవుతుంది. దేశంలో ఇటీవల 157 కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్క కాలేజీ ని కూడా ఇవ్వలేదు. అయినా సీఎం కేసీఆర్ గారి చొరవతో రాష్ట్రంలో వైద్యరంగం ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
14,15,16 తేదీల్లో 3 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన 1500 మంది డాక్టర్లు, పలువురు ప్రతినిధులు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విసి కరుణాకర్ రెడ్డి, ఎంజీఎం ప్రిన్సిపల్ డాక్టర్ వలప దాసు చంద్ర శేఖర్, ఫలనియప్పన్, నాగేందర్, తిరుపతి రావు, అల్కా దేశ పాండే, లక్ష్మి, రాజారావు, శంకర్ కంపా, ఆలం భిక్షపతి రావు తదితరులు పాల్గొన్నారు