365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి క్రీడలే దోహదం చేస్తాయని, కాబట్టి విద్యార్థులు దైనందిన జీవితంలో క్రీడల్ని భాగంగా చేసుకోవాలని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డా.దండా రాజిరెడ్డి అన్నారు.

రాజేంద్రనగర్ లోని ఉద్యాన కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించే నాలుగవ అంతర్ కళాశాలల క్రీడలు, ఆటలు, సంస్కృతిక, వైజ్ఞానిక సమ్మేళనం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో చదువుతోపాటు క్రీడలకు సైతం సమాన ప్రాతినిధ్యం ఇస్తున్నామని తెలిపారు. ఇందుకు విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని కళాశాలలలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమే అని తెలిపారు.

క్రీడలతో జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం పెంపొందించుకోవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అటల పోటీల్లో గెలుపొటములు సహజమని ఆటల, పోటీల్లో పాల్గొనడమే విజయం గా భావించాలని డాక్టర్ రాజిరెడ్డి పిలుపునిచ్చారు. సమాజంలో సక్సెస్ఫుల్ పీపుల్ చాలా వరకు స్పోర్ట్స్ మేనేనని, ఆటల పోటీలతో పోటీతత్వం పెరుగుతుందని, చదువుల్లో సైతం బాగా రాణిస్తారని డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు.

ఈర్ష, ద్వేషాలకు అతీతంగా, స్పోర్ట్స్ మెన్షిప్ తత్వమే ప్రధాన అజెండాగా క్రీడల పోటీలు జరగాలని ఆయన సూచించారు.

తెలంగాణలో సంప్రదాయ ప్రతీకలైన బతుకమ్మ , కోలాటాలు, పేరిణి శివతాండవం నృత్యాలు అంశాల్లో విద్యార్థులు ప్రవేశం కలిగి ఉండాలని, సమగ్ర అవగాహన కలిగి ఉండాలని వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు.

క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసానికి శారీరకంగా దృఢత్వానికి ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటినుండి సరైన ప్రణాళికలతో ప్రయత్నం చేయాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు కాలానుగుణంగా వచ్చే నైపుణ్యాలను నేర్చుకోవాలని వివరించారు.

విద్యార్థికి నైపుణ్యాలే భవిష్యత్తుకు పునాదులని తెలిపారు. విద్యార్థులు నేర్చుకోవాలని జిజ్ఞాసను పెంచుకొని కొత్త విషయాలను సాంకేతికతను అందిపుచ్చుకొని ఇతరులకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలవాలని పేర్కొన్నారు.


ఉద్యాన విద్యతో భవిష్యత్తు లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని తెలిపారు. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి ఇతరులకు అవకాశాలను అందించవచ్చు అని స్టార్ట్ అప్ ప్రారంభించి, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అని తెలిపారు. విద్యార్థులు నూతన ఆలోచనలకు పదును పెడుతూ కొత్త కొత్త ఆవిష్కరణలను తీసుకురావాలన్నారు.


ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రశాంత్ ఆటల పోటీల మీట్ పై స్వాగత ఉపన్యాసం చేశారు. 5 కాలేజీల నుండి 20 క్రీడాలలో, 18 సాంస్కృతిక పోటీల లో మొత్తం 251 విద్యార్థిని, విద్యార్థులు పాల్గొంటున్నారు.

కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఏ. భగవాన్, డీన్ డాక్టర్ ఎం. రాజశేఖర్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ లక్ష్మీనారాయణ, రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రశాంత్, మల్యాల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె. చీనా నాయక్, మోజెర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్య, జోనల్ హెడ్ డాక్టర్ సురేష్ రెడ్డి, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.