365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 14,2022:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘శ్రీజ ఆకుల’ సోమాజిగూడలోని తన నివాసరంలో మొక్కలు నాటారు.
‘శ్రీజ ఆకుల’ అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీలలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ యువ క్రీడాకారిణి. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆగస్టు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో బంగారు పతకం సాధించింది.
ఈ సందర్భంగా ‘శ్రీజ ఆకుల’ మాట్లాడుతూ… మొక్కలు నాటడం మనిషి జీవితానికి చాలా అవసరమని, ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గొప్ప కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొని మొక్కలు నాటడం ఎంతో ఆనందంగాను, గర్వంగాను ఉందన్నారు.
మొక్కలు నాటడం వల్ల సమయానికి వర్షాలు పడుతాయని, తద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని, ఆరోగ్యకరమైన జీవనం ఏర్పడుతుందన్నారు. మన పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని శ్రీజ ఆకుల చెప్పారు.
అనంతరం తన కోచ్ సోమ్నాథ్ ఘోష్, స్నేహితురాలు కృతిక, బంధువు ఉమామహేశ్వర రావు లను ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో పాల్గొని మొక్కలు నాటాలని శ్రీజ ఆకుల కోరారు.