365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జూన్ 18,2021: కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం ఏకాంతంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం జరిగింది. ఇందుకోసం 10 రకాల పుష్పాలు, 4 రకాల పత్రాలు కలిపి దాదాపు 2 టన్నులు వినియోగించారు. ఈ పుష్పాలను తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల దాతలు విరాళంగా అందించారు.
ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఏఈవో శ్రీ రవికుమార్‌రెడ్డి, ప్రధానార్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ కుమార్, శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ కామరాజు, శ్రీ మునీంద్రబాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.