
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్, ఏప్రిల్5, 2022: సంవత్స రాల తరబడి నిరంతర ప్రయత్నాలకు తోడు, పుట్టపర్తిలో జిల్లా కేంద్రం ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించిన అనంతరం శ్రీ సత్యసాయి బాబా జిల్లాగా నేడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సత్య సాయి జిల్లాను ఏర్పరిచింది. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేశారు.

స్వామి వారి సోదరుడు, రత్నాకర్ తండ్రిగారు జానకిరామయ్య గారు, ఈ జిల్లా ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జిల్లా కేంద్ర డిమాండ్‌ను ఆయన తీసుకురావడంతో పాటుగా దశాబ్దాల క్రితమే శ్రీ సత్యసాయి జిల్లా ఆవశ్యకతను ఆయన వెల్లడించారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్ తన సంతోషాన్ని వెల్లడిస్తూ ‘‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా బాబా భక్తులందరూ శ్రీ సత్య సాయి జిల్లా ఏర్పాటు పట్ల పూర్తి సంతోషంతో ఉన్నారు. ఈ నూతన జిల్లా ఏర్పాటు మరింత అభివృద్ధికి మార్గం ఏర్పరుస్తుందని, మరింత మంది ప్రజలు ఈ పూజ్య భూమిని సందర్శించడంతో పాటుగా ఆధ్యాత్మికంగా పునరుత్తేజం కాగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

బసంత్ కుమార్ ఐఏఎస్ (2012 కేడర్) ఈ నూతన జిల్లాకు కలెక్టర్‌గా నియమితులయ్యారు. శ్రీ సత్య సాయి సెంట్రల్‌ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ; పుట్టపర్తి ఎంఎల్‌ఏ శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ,ఇతర ఎంఎల్‌ఏలు సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా బసంత్ కుమార్ తన బాధ్యతలను స్వామి వారి సంగీత కళాశాల ప్రాంగణం( ప్రధాన సంగీత కళాశాల భవంతి పక్కనే ఉంది)లో ఏర్పాటుచేసిన తాత్కాలిక కార్యాలయంలో స్వీకరించారు. భారతదేశంలో అత్యంత నిరాడంబర మైన ఐఏఎస్ అధికారులలో బసంత్ కుమార్ ఒకరు. మృదుస్వభావి అయిన ఆయన ఆడంబరాలకు దూరంగా ఉంటారు.జిల్లా ఏర్పాటును పురస్కరించుకుని పుట్టపర్తి జిల్లా వాసులు ఐదు రోజుల పాటు వేడుకలను నిర్వహించడానికి ప్రణాళిక చే శారు.