365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 28 జూన్ 2023: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య సింహ లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం ఆస్థానం ఘనంగా జరిగింది.

శ్రీ సౌమ్యనాథస్వామి, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించిన స్వామి. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు.
18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని ఉద్దేశం. రూ. 50 లక్షలతో వసతుల కల్పన : జేఈవో శ్రీమతి సదా భార్గవి
ఈ సందర్భంగా జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు . మూలవిరాట్‌తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో మౌళిక వసతుల కల్పనకు రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. త్వరలో ఆర్కియాలజి డిపార్టుమెంటు అనుమతులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దిలీప్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
28-06-2023 రాత్రి – యాలి వాహనం
29-06-2023 ఉదయం – పల్లకీ సేవ రాత్రి – హంస వాహనం
30-06-2023 ఉదయం – పల్లకీ సేవ రాత్రి – సింహ వాహనం
1-07-2023 ఉదయం – పల్లకీ సేవ రాత్రి – హనుమంత వాహనం
2-07-2023 ఉదయం – శేష వాహనం రాత్రి – గరుడ వాహనం

3-07-2023 ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం
4-07-2023 ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు) రాత్రి – గజ వాహనం
5-07-2023 ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గంటలకు) రాత్రి – అశ్వవాహనం
6-07-2023 ఉదయం – చక్రస్నానం రాత్రి – ధ్వజావరోహణం
జూలై 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 7న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.