365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి,ఆగస్టు 3,2022: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2022 విడుదల య్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. జూలై 6 నుంచి 15 వరకు జరిగిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 1,91,600 మంది విద్యార్థులు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బాలురు 60.83 శాతం, బాలికలు 68.76 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.
కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించడం లేదు. దీనికి తోడు ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కూడా ఊహించిన దానికంటే తక్కువగానే ఉంది. 2,01,627 మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో ఉత్తీర్ణత శాతం (67.26%) బాగా తగ్గింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పదో తరగతి ఫలితాల్లో గ్రేడ్‌లకు బదులు మార్కులను ప్రకటించింది.
అలాగే, సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఏప్రిల్-2022 రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు. కరోనా కారణంగా పరీక్షలు సకాలంలో నిర్వహించకపోవడం, తరగతులు సక్రమంగా నిర్వహించక పోవడంతో విద్యార్థుల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.