365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం,నవంబర్ 1,2025: జిల్లాలోని కాశీబుగ్గలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తుల్లో జరిగిన తొక్కిసలాట (Stampede) కారణంగా 9 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు.

కార్తీక మాసం కావడంతో, ఏకాదశి రోజున వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయం వద్ద ఒక్కసారిగా జనసందోహం పెరిగి, నియంత్రణ కోల్పోవడంతో తొక్కిసలాట జరిగింది.

ప్రమాదంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

గాయపడిన భక్తులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి, సహాయక చర్యలు చేపట్టారు.

తొక్కిసలాట జరగడానికి గల కారణాలు, ఆలయ భద్రతా ఏర్పాట్లలో లోపాలపై అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.ఈ విషాద ఘటనతో కాశీబుగ్గ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.