365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 18, 2023: స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హాంకాంగ్‌, సింగ్‌పూర్‌, కొరియా సూచీలు ఎరుపెక్కగా మొన్నటి వరకు పతనమైన చైనా సూచీలు పుంజుకున్నాయి.

ఈ వారం యూఎస్‌ ఫెడ్‌ సమావేశం కానుండటం, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పైగా భారత సూచీలన్నీ గరిష్ఠాల్లోనే ఉండటంతో ప్రాఫిట్‌ బుకింగ్‌కు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయి.

నిఫ్టీ 50 కీలకమైన 20,100 లెవల్‌ను నిలబెట్టుకుంది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.27 వద్ద స్థిరపడింది.

ఉదయం 20,155 వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20,195 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. 20,115 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 59 పాయింట్ల నష్టంతో 20,133 వద్ద ముగిసింది.

బ్యాంకు నిఫ్టీ 251 పాయింట్లు ఎరుపెక్కి 45,979 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్లో 67,838 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,665 వద్ద మొదలైంది.

ఆరంభంలో ఫ్లాట్‌గా చలించిన సూచీల 67,803 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆపై 67,532 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకి మొత్తంగా 241 పాయింట్ల నష్టపోయి 67,596 వద్ద క్లోజైంది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 24:26గా నమోదైంది. పవర్‌ గ్రిడ్‌ (3.12%), టైటాన్‌ (2.66%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (2.43%), ఎం అండ్‌ ఎం (2.26%), బీపీసీఎల్‌ (2.26%) టాప్‌ గెయినర్స్‌. హిందాల్కో (2.19%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1.93%), అదానీ పోర్ట్స్‌ (1.80%), డాక్టర్‌ రెడ్డీస్‌ (1.68%), భారతీ ఎయిర్‌ టెల్‌ (1.40%) టాప్‌ లాసర్స్‌.

నిఫ్టీ పతనంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫీ, ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంకులే కీలకంగా మారాయి.

ఆటో, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు బలపడ్డాయి. రియాల్టీ, మీడియా, మెటల్‌ రంగాలు విపరీతంగా నష్టపోగా ఐటీ, స్మాల్‌క్యాప్‌, బ్యాంకు, ఫార్మాలో సెల్లింగ్‌ ప్రెజర్‌ కనిపించింది.

నిఫ్టీ సెప్టెంబర్‌ టెక్నికల్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 20,220 వద్ద బలమైన రెసిస్టెన్స్‌ కనిపిస్తోంది. 22,150 వద్ద సపోర్టు ఉంది. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి టాటా మోటార్స్‌, బర్జర్ పెయింట్స్‌, నెస్లే ఇండియా, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

బ్యాంకు నిఫ్టీ 46,300 లెవల్‌ను దాటలేకపోయింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల జోరు కొనసాగే సూచనలు ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంకు కొంత కాలం పెరిగే ఛాన్స్‌ ఉంది. పాజిటివ్‌ కామెంటరీతో బజాజ్‌ ఆటో షేర్లు పెరిగాయి.

ఎం అండ్‌ ఎం, టీవీఎస్‌ రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. బీమా రంగ కంపెనీల్లో జోష్‌ కనిపిస్తోంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ 52 వారాల గరిష్ఠానికి చేరుకుంటోంది. కొత్త ఆర్డర్లు రావడంతో డిఫెన్స్‌ స్టాక్స్ పెరుగుతూనే ఉన్నాయి.

వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తుండటంతో పీవీఆర్‌ ఐనాన్స్‌ నష్టాలు కొనసాగుతున్నాయి. ధరలు తగ్గడంతో రసాయన కంపెనీల షేర్లు తగ్గాయి. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో 10.5 లక్షల షేర్లు చేతులు మారాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ 12 ఏళ్ల గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ విలువను మరో రూ.4 లక్షల కోట్ల మేర పెంచింది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.