365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 23,2023: హైదరాబాద్ నగరంలో వీధికుక్కల ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణ కు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ ఎంసీ, వెటర్నరీ, హెల్త్ తదితర శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డిలతో కలిసి నిర్వహించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ హెల్త్ శృతి ఓజా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ జోనల్ కమిషనర్ లు పాల్గొన్నారు.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల అంబర్ పేట లో 4 సంవత్సరాల చిన్నారి బాలుడు కుక్కల దాడిలో గాయపడి మృతిచెందడం అత్యంత బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.
నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, ప్రజల భద్రత, జీవాల సంరక్షణ కు ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలకు స్టెరిలై జేషన్ నిర్వహించాలని ఆదేశించారు.
బస్తీలు, కాలనీల పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే జీహెచ్ ఎంసీ అధికారులు కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ లను వేసే చర్యలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
అధికంగా కుక్కలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, త్రాగునీరు కుక్కలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అవసరమైన ప్రాంతాల్లో నూతన సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. రోడ్లపై కుక్కలకు ఇష్టమొచ్చినట్లు గా ఆహారం వేయడం వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలని అన్నారు.
మాంసపు షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్ధాలను రోడ్లపై వేస్తున్న కారణంగా మటన్, చికెన్ షాపుల వద్ద కుక్కల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండటానికి కారణం అవుతున్నాయని పేర్కొన్నారు.
మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీములతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి జీహెచ్ ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయవచ్చన్నారు.
ప్రత్యేక యాప్ ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వాటి ద్వారా ద్వారా పిర్యాదులు చేయొచ్చని వివరించారు. కోతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అన్నారు.
కోతులను పట్టుకోవడంలో ప్రత్యేక అనుభవం ఉన్న వారి ద్వారా నగరంలోని కోతులను పట్టుకొని అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
చనిపోయిన జంతువులను సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు.