Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 29,2024: ‘కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం అనేది చిన్న విషయం కాదు.. ఇక్కడ వ్యవస్థీకృత నేరానికి అలవాటు పడిన మాఫియా. రేపటి రోజున దేశ భద్రత కు విఘాతం కలిగించొచ్చు.

ఆర్డీఎక్స్, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు తీసుకురావడానికి, దేశ భద్రతను విచ్ఛిన్నం చేసే తీవ్రవాదులు చొరబాటుకు సహాయం చేయడానికి కూడా ఏ మాత్రం సంకోచించవ’ని ఉప ముఖ్యమంత్ర్రివర్యులు పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాఫియా ఎంత బలంగా పనిచేస్తోందో నాకు ఈ రోజు కళ్లకు కట్టినట్లు అర్థమైంది.

ఉప ముఖ్యమంత్రి పదవిలో హోదాలో నడి సముద్రంలో అక్రమ రేషన్ బియ్యం పట్టుబడిన నౌకను పరిశీలించేందుకు వెళ్దామంటే కూడా ఓ బలమైన మాఫియా అడ్డుపడిందని ఆవేదన చెందారు. కాకినాడ నౌకాశ్రయం నుంచి పూర్తి పారదర్శకతతో ఎగుమతులు జరగాలి తప్పితే, ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక కార్యకలాపాలకు, ఎగుమతులకు అడ్డాగా మారితే ఊరుకోబోమని హెచ్చరించారు.

శుక్రవారం కాకినాడ యాంకరేజీ పోర్టులో ఇటీవల అక్రమంగా రవాణా అవుతూ పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అలాగే రెండ్రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో నడి సముద్రంలో సౌతాఫ్రికాకు వెళ్తూ స్టెల్లా ఎల్ అనే నౌకలో పట్టుబడిన 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ సముద్రంలోకి ఓ బోటు సహాయంతో వెళ్లారు.

ఉప ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ ఉన్నారు.

అనంతరం పోర్టులో విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘కాకినాడ పోర్టు పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. రోజుకి ఇక్కడికి వెయ్యి నుంచి 1100 లారీలు ఇక్కడకు వస్తాయి.

బియ్యం ఎగుమతులకు ఇది కీలకమైన పోర్టు. ఇక్కడి నుంచి విదేశాలకు సులభంగా బియ్యం ఎగుమతులు చేయొచ్చు. కీలకమైన ఈ పోర్టును స్థావరంగా చేసుకొని రేషన్ బియ్యం మాఫియా అరాచకాలు పెట్రేగిపోతున్నాయి.

• కీలకమైన పోర్టుకు 16 మంది మాత్రమే భద్రత
ఎగుమతులపరంగానూ, భద్రతపరంగానూ ఎంతో కీలక ప్రాధాన్యం ఉన్న కాకినాడ పోర్టుకు కెవలం 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండడం నివ్వెరపరుస్తోంది. రోజుకు వెయ్యి నుంచి 1100 లారీలు ఇక్కడకు వస్తుంటాయి.

వాటిలో ఏముందో, ఏం పంపుతున్నారో నిశితంగా తనిఖీ చేయాల్సిన బాధ్యత ఉన్న సెక్యూరిటీ విభాగంలో కేవలం 16 మంది మాత్రమే ఉన్నారంటే పోర్టు కేంద్రంగా ఎలాంటి తనిఖీలు జరుగుతున్నాయో, ఎలాంటి భద్రత ఉందో అర్ధం అవుతోంది.

చాలా ప్రాధాన్యం ఉన్న పోర్టు భద్రతపై ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా..? బియ్యం అక్రమ రవాణానే కాదు.. దేశానికి సంబంధించిన భద్రత కూడా పోర్టు మీద ఆధారపడి ఉంది. మరి ఈ భద్రతను పెట్టుకొని ఏం రక్షణ ఇస్తారు..? అసలు పోర్టుకు అందించాల్సిన భద్రత ఇదేనా..? అనే అనుమానం కలుగుతోంది.

• నన్ను పోర్టుకు రావద్దని చాలామంది చెప్పారు
అక్రమ రేషన్ బియ్యం ఎగుమతులకు కేంద్రంగా మారిన కాకినాడ పోర్టును ఎప్పటి నుంచో పరిశీలించాలని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో పట్టుబడిన బియ్యం విషయంలో నాకు సమాచారం రాగానే రావాలని, పోర్టులోని వాస్తవ పరిస్థితులు పరిశీలించాలని భావించాను.

పోర్ట్ పరిశీలనకు బయలుదేరుతున్న సమయంలో నాకు చాలా మంది ఇక్కడికి రావద్దు అని సందేశాలు పెట్టారు. నేను వస్తే 10 వేల మంది ఉపాధి దెబ్బ తింటుందని చెబుతున్నారు. నేను స్మగ్లింగు, అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని మాత్రమే కోరుకుంటున్నాను.

ఉపాధి అవకాశాలు దూరం చేయడం నా ఉద్దేశం కాదు. కాకినాడ పోర్టు అనేది స్మగ్లింగ్ కోసం అనుమతి ఇచ్చిన మార్గం కాదు. ఇది చట్టబద్ధమైన ఎగుమతులకు వారధి. గత రెండు నెలలుగా కాకినాడ పోర్టుకు రావాలని చాలాసార్లు ప్రయత్నించాను. చాలామంది అధికారులు, కొందరు నాయకులు ఇక్కడకు రావద్దని మేము చూసుకుంటామని రకరకాలుగా చెప్పారు.

మీరు వస్తే కొత్త సమస్యలు వస్తాయని చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితిని పరిశీలించడానికి స్వయంగా వచ్చాను. ఇక్కడున్న పరిస్థితి, అధికారుల తీరు, జరుగుతున్న పనులు చూస్తుంటే మాఫియా తీరు ఎంత బలంగా ఉందో, నా పర్యటనను పరోక్షంగా అడ్డుపడింది ఎవరో తెలుస్తుంది.

• షిప్ కూడా ఎక్కనివ్వని మాఫియా బలం
ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్తూ సముద్రంలో జిల్లా అధికారులకు పట్టుబడిన 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్న షిప్ పరిశీలించాలని సముద్రంలోకి వెళ్ళాను. స్టెల్లా ఎల్ అనే షిప్ లో ఉన్న అక్రమ రేషన్ బియ్యాన్ని పరిశీలించడానికి వెళ్తే నన్ను షిప్పు కూడా ఎక్కనివ్వకుండా వేర్వేరు కారణాలు చెబుతూ బోటులో అక్కడక్కడే తిప్పారు.

ఒక ఉపముఖ్యమంత్రిగా నన్నే షిప్పు ఎక్కనివ్వకుండా బోట్లో తిప్పారు అంటే దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అర్ధం అవుతుంది. ఒక ఉప ముఖ్యమంత్రికి కూడా సహకారం అందకుండా చేసేంత పెద్ద నెట్వర్క్ దీని వెనుక దాగి ఉంది. ఆ షిప్ లో బియ్యం కాకుండా ఇంకా ఏమున్నాయో స్వయంగా చూసేందుకు వెళ్తే నన్ను షిప్ చుట్టూ తిప్పారు.

అదేంటి అని అడిగితే సముద్రం రఫ్ గా ఉందని, వెళ్ళడానికి లేదని కథలు చెప్పారు. నా వెనుక వచ్చిన వారు చిన్న బోట్లలో నౌక వద్దకు వెళ్లినా, నన్ను మాత్రం షిప్ ఎక్కకుండా చేశారు. ఓ ఉప ముఖ్యమంత్రికి ఇదే పరిస్థితి వచ్చిందంటే దీనివెనుక ఎంత పెద్ద మాఫియా ఉందో అర్థమవుతుంది.

• దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఏం చేస్తారు..?
కీలకమైన కాకినాడ తీర ప్రాంతంలో సరైన భద్రత లేదు. కీలకమైన కేంద్ర సంస్థలు, ప్రముఖ చమురు కేంద్రాలు ఉన్నచోట తీర ప్రాంతంలో భద్రత లోపిస్తే చాలా ప్రమాదం. కేవలం బియ్యం అక్రమ రవాణా విషయం ఒక్కటే కాదు.. ఇక్కడ భద్రత కూడా చాలా ముఖ్యం.

అక్రమంగా బియ్యం రవాణా యథేచ్ఛగా జరుగుతుంటే, దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పేలుడు పదార్థాలు, వ్యక్తులు రావడం పెద్ద కష్టం కాదు. వ్యవస్థీకృత నేరాలకు అలవాటు పడిన వారు దేశ భద్రత విషయంలో రాజీ పడతారు అని అనుకోను. ఇది రేషన్ బియ్యం అక్రమ రవాణా నేరంగానే చూడకుండా, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలి.

దీనిపై నేను కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తాను. దీనిపై వెంటనే పట్టించుకునేలా, ఈ సీరియస్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను.

గతంలోనూ విశాఖ తీర ప్రాంతానికి శత్రుదేశాల జలాంతర్గాములు వచ్చాయి. మరీ అలాంటప్పుడు కాకినాడ లాంటి కీలకమైన తీర ప్రాంతం సేఫ్ అని ఎలా చెప్పగలం..? కసబ్ లాంటి వాళ్ళు ముంబై పోర్టులోకి ప్రవేశించి అక్కడి నుంచి ఎంత ఉగ్రదాదులు చేశారో చూశాము. పేలుడు పదార్థాలు వచ్చాయి. హైదరాబాద్ గోకుల్ చాట్ పేలుళ్లు జరిగాయి.

• కేంద్రమే ఆఫ్రికా దేశాలకు ఇస్తే, దేశ ఖ్యాతి పెరుగుతుంది
కిలో రేషన్ బియ్యం పేదలకు ఇచ్చేందుకు ప్రభుత్వానికి రూ.43.50 పైసలు ఖర్చు అవుతోంది. అంటే ప్రతి కేజీకి ఆ డబ్బును ప్రభుత్వం భరించి, ప్రజలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాల వల్ల ఇంటింటికి తీసుకొచ్చే బియ్యాన్ని అక్కడే లబ్ధిదారుల వద్ద కొని వాటిని బియ్యం మాఫియా చేతిలో పెడుతున్నారు.

తర్వాత బడా బాబులు పోర్టుల నుంచి ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. ప్రభుత్వం భరిస్తున్న రాయితీ సొమ్ము బియ్యం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది. ఇవే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించి అక్కడ కేజీ రూ. 72, రూ. 74 లకు మాఫియా వ్యక్తులు అమ్ముతున్నారు. అంటే ఇటు ప్రభుత్వ ఖాజానాకు గండి పడుతూ.. ఆ బియ్యం పేదలకు నిరూపయోగంగా మారుతున్నాయి.

ఇలా కాకుండా ఆఫ్రికా దేశాలకు భారతదేశమే కేజీ బియ్యం రూ. 42 లకు ఇచ్చినా దేశం గౌరవం, ఖ్యాతి ప్రపంచంలో ఎంతో పెరుగుతుంది.

• భద్రతపై సమాధానం చెప్పాల్సిందే
కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న విషయం మీద పోర్టు సీఈఓకు, పోర్టు స్టేక్ హోల్డర్స్ కు నోటీసులు ఇస్తాం. కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నేను ప్రత్యేకంగా లేఖ రాస్తాను. ఇక్కడ పోర్టులో భద్రత లేదు. కసబ్ లాంటి ఉగ్రవాదులు ముంబైకి పోర్టు ద్వారానే వచ్చారు. ముంబైకి పేలుడు పదార్థాలు చేరాయి.

ఎంతటి ఉగ్రవాద దాడులు జరిగాయో చూశాం. 25 వేల కేజీల మత్తు పదార్థాలు విశాఖ తీరంలో దొరికాయి. ఇక్కడ అలీ షా అనే పేరు పదే పదే వినిపిస్తోంది. ఇదే తరహాలో నేర చర్యలకు అలవాటైపోతే రేపొద్దున్న దేశభద్రతకు కూడా ప్రమాదం. ఆర్ డి ఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు తేవడానికి, టెర్రరిస్టులు రావడానికి వాళ్ళు సహకరిస్తారు. నేరాలు అలవాటు పడినవారు ఎంతకైనా తెగిస్తారు.

• నిందితులపై పీడీ యాక్టు పెడతాం
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపులో పట్టుబడుతున్న వారిపై పీడీ యాక్ట్ పెడతాం. భూ ఆక్రమణలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఇటీవల తీర్మానించాం. అలాగే అక్రమ రేషన్ బియ్యం రవాణాలో పట్టుబడుతున్న వారినిపై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తాం. ఇది తీవ్రమైన నేరమే. ప్రజా ధనం కొల్లగొడుతున్న వారిని ఉపేక్షించేది లేదు.

ఈ మొత్తం విషయంలో ఓ బలమైన మాఫియా పనిచేస్తోంది. రైసుమిల్లర్లకు దీనిలో ప్రమేయం ఉంటుందని నేను భావించడం లేదు. అసలు మాఫియా ఎక్కడ.. ఎలా మొదలువుతుందనే విషయం మీద దృష్టిపెడతాం. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ఖజానాలో తగినన్ని నిధులు లేక కింద మీద పడుతుంటే ప్రభుత్వ ఖజానాకు గండిపెట్టి అక్రమార్కులు వేలకోట్లు దోచుకుంటున్నారు.

రేషన్ బియ్యం తాలూకా డబ్బులే కనుక ప్రభుత్వం దగ్గర ఉంటే రోడ్లు వేయడానికి, సంక్షేమ పథకాలు అమలుకు, పాలనకు ఇబ్బంది ఉండేది కాదు. అంత భారీగా రేషన్ మాఫియా ప్రజాధనం కొల్లగొడుతోంది.
• సమగ్ర విచారణ చేయిస్తాం

కాకినాడ పోర్టు నుంచి పారదర్శకంగా ఎగుమతులు జరగాలి. ఇక్కడ నుంచి ఎగుమతి అయ్యే ప్రతి సరుకు చట్టబద్ధంగా ఉండాలి. ప్రైవేట్ పోర్టు నుంచి ఇష్టానుసారం తరలిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కచ్చితంగా దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు, వ్యవస్థలను ఆడిస్తున్న అసలు శక్తులు ప్రజలకు సమాధానం చెప్పే సమయం వస్తుంది.

అక్రమ రేషన్ బియ్యం తరలింపు వెనుక కింగ్ పిన్స్ ఉన్నాయి. సుమారు 16 కంపెనీలతో వారు రకరకాల మార్గాల్లో బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్నారు. బియ్యం పట్టుకున్నప్పటికీ వెంటనే కోర్టులను ఆశ్రయించి చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఆలోచిస్తాం.

అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెడతాం. ఒక వ్యక్తి లక్ష్యంగా ఈ అక్రమ రేషన్ బియ్యం మాఫియా గురించి ఆలోచించడం లేదు. రేషన్ బియ్యం విషయంలో ప్రభుత్వ ఖజానా నుంచి వేలాది కోట్లు దర్జాగా కొల్లగొడుతున్నారు. ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బును అక్రమంగా జేబులో వేసుకుంటున్నారు. ఈ మొత్తం అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నాశనం చేయాలి అన్నదే మా విధానం.

• అధికారుల్లోనూ మార్పు రావాలి
ప్రతిసారి బియ్యం మాఫియాను ఆపేందుకు ప్రజాప్రతినిధులు రావాలంటే సాధ్యం కాదు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంలో కూడా మార్పు రావాలి. ఏదైనా చర్య తీసుకుంటున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు మోకాలడ్డుతున్నారు.

గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసినా, మళ్లీ పరిస్థితి ఇప్పుడు మొదటికొచ్చింది. అధికార యంత్రాంగంలోనూ ప్రక్షాళన జరగాలి. పిడిఎస్ బియ్యం దొరికిన బార్జీని సీజ్ చేయమని చెప్పాము. అదే విధంగా స్టెల్లా ఎల్ నౌకను కూడా సీజ్ చేయాలని స్పష్టం చేశాను.

ఓ ప్రత్యేక మాఫియా దీన్ని మొత్తం నడిపిస్తోంది. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజాధనాన్ని ఈ మాఫియా కొల్లగొడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలా లేక సీఐడీతో విచారణ చేయించాలా అన్నది క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

ఈ విషయం కచ్చితంగా దేశ భద్రతతో ముడిపడి ఉంది. మూడు రోజుల ముందే పరిశీలనకు వచ్చి ఉంటే ఈ కీలక విషయాన్ని ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రికి కూడా స్వయంగా తెలియజేసేవాడిని.

కాకినాడ పోర్టు నుంచి పూర్తి పారదర్శకంగా ఎగుమతులు ఉండాలన్నదే మా ఆశయం’’ అన్నారు. విలేకర్ల సమావేశంలో నాదెండ్ల మనోహర్,వనమాడి కొండబాబు,తోట సుధీర్ పాల్గొన్నారు.

error: Content is protected !!