365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల, ఏప్రిల్2,2022 : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలో నికి ప్రవేశించారు.
ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తుల కు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.
అనంతరం టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ, విదేశాలలో ఉండే తెలుగు ప్రజలకు నూతన శ్రీ శుభకృత్‌నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీవారి ఆనుగ్రహంతో కరోనా మహమ్మారి నుండి బయటపడి దేశ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు. రాబోవు రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు లేకుండా లోకంలోని మానవాళిని కాపాడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు.