365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 9,2025: హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ వైద్యులు మరో చక్కని విజయాన్ని సాధించారు. తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్న 19 ఏండ్ల యువకుడికి విజయవంతంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం ద్వారా వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.

కాటేదాన్‌కు చెందిన పూజారి అనిల్‌కుమార్ గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్న అతనికి, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 24 ఏళ్ల యువకుడి గుండె సరిపోవడంతో తక్షణమే మార్పిడి ప్రక్రియ చేపట్టారు.

నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ అమరేశ్ బాబు నేతృత్వంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సమష్టిగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించారు. హార్ట్ మార్పిడి ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీ కింద ఏర్పాట్లు చేయడంతో అనిల్‌కుమార్ కుటుంబానికి ఆర్థిక భారంలేకుండా వైద్యం అందిందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వివరించారు.

నిమ్స్‌లో అవయవ మార్పిడి సేవల విస్తరణ

గత ఏడాది నిమ్స్‌లో 62 కిడ్నీ, 4 లివర్, 2 హార్ట్, 1 లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగగా, ఈ ఏడాది ఇప్పటివరకు 16 కిడ్నీ, 1 లివర్, 1 హార్ట్ మార్పిడి జరిగిందని బీరప్ప తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో, ఒకేసారి హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఏకైక కేంద్రంగా నిమ్స్ నిలిచిందని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి…మహిళా దినోత్సవం సందర్భంగా మెగా మదర్ అంజనమ్మతో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సంతోషకరమైన అనుభూతులు!

Read this also… “Amma is the Magic That Holds Us Together and the Reason Behind Our Strong Family Bond” – Megastar Chiranjeevi

అవయవదానంపై అవగాహన పెంచాలి: మంత్రి

డోనర్ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి, అవయవదానం ద్వారా మరో వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించడమే నిజమైన మానవతా సేవ అన్నారు. ప్రజల్లో అవయవదానం పై అవగాహన పెంచేందుకు మరింత ప్రచారం అవసరమని సూచించారు.

గాంధీ హాస్పిటల్‌లో త్వరలోనే అధునాతన అవయవ మార్పిడి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇకపై అవయవ మార్పిడి విషయంలో అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

“ప్రాణదాతలుగా నిలిచి మరొకరికి పునర్జన్మ ఇవ్వండి. అవయవాలను వృథాగా పోనీయొద్దు” అని మంత్రి ప్రజలను ఉద్దేశించి పిలుపునిచ్చారు.