365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 6 ఏప్రిల్ 2023: రొటీన్ కు భిన్నంగా ఉండే ఏ అంశంమైనా అందరినీ ఆకర్షిస్తుంది.. ఆకర్షించడమే కాదు ఆసక్తి కూడా కలిగిస్తుంది. సరిగ్గా అదే ఆలోచనతో ముందుకొచ్చాడు హైదరాబాద్ నగరానికి చెందిన కార్ మెకానిక్ సుధాకర్.
తన మదిలో మెదిలిన ఆలోచననే ఆచరణలో పెట్టాడు.. బహదూర్ పురా లో ఉన్నఈ “వాకీకార్ల మ్యూజియం” ప్రపంచంలోనే మొట్టమొదటి వాకీ కార్ల మ్యూజియంగా గుర్తింపు పొందింది.
బహదూర్ పురాలో ఉన్నఈ “సుధాకార్ల మ్యూజియం” పేరు వినగానే వింతగా విచిత్రంగా ఉండే వాకీ కార్లే కళ్లలో మెదులుతాయి. పలు ఆకృతుల్లో ఉన్నకార్లు, బైక్ లు, రైళ్లు, బస్సులు, వింటేజ్ కార్లు గుర్తుకు వస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన కార్ల ప్రదర్శన చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వండర్ సుధా‘కార్ల’ మ్యూజియం ప్రపంచంలోనే మొట్టమొదటి వాకీ కార్ల మ్యూజియంగా గుర్తింపు పొందింది.
వండర్ వాహనాలన్నీ ఒకే చోట..
వండర్ వాహనాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు. అరుదైన వాహనాలే ఇక్కడ కనిపిస్తుంటాయి. భారతదేశంలోనే అతి చిన్న సైకిల్ కూడా ఇక్కడే ఉన్నది దీని ఎత్తు ఆరు ఇంచలు. ఒక్క సైకిళ్ల విభాగంలోనే 50రకాల వెరైటీలున్నాయి.
సింగిల్ సీటు నుంచి మల్టీ సీటు వరకు వాటిలో పెన్నీ ఫర్తింగ్ సైకిళ్లు, టెండెమ్స్ సైకిళ్లు, రికంబెంట్ బైస్కిల్స్ సుధాకార్ మ్యూజియంలో దర్శనమిస్తాయి. మోటారు సైకిల్ విభాగంలో 12రకాలు డిజైన్లు కనువిందు చేస్తాయి. వీటిలో చెప్పుకోదగినది 13ఇంచుల ఎత్తు కలిగిన మోటార్ సైకిల్.
ఇది గంటకు 30 కిలో మీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మూడు చక్రాల సైకిల్ అయితే ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో స్థానం సంపాదించింది. దీని ఎత్తు 41అడుగుల 7ఇంచలు కాగా, బరువు మూడు టన్నుల వరకూ ఉంటుంది. వీల్ డయామీటర్ 17 అడుగులు, ఇది 37అడుగుల 4 అంగుళాల పొడవు ఉంటుంది.
సహజంగా మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యం ఉన్నవాళ్లకు కూడా వాకీ కార్లను ఇంత సులువుగా తయారు చేయడం సాధ్యం కాదంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు.అయితే చదివిన చదువుకూ తాను చేసే పనికి ఎటువంటి సంబంధం లేదు. సుధాకర్ కు చిన్నప్పటి నుంచే వినూత్నంగా కార్లు తయారుచేయాలనే అభిరుచి ఉండేది.
ఆ అభిరుచే సుధాకర్ను మ్యూజియం ప్రారంభించాలనే ఆలోచన వరకూ నడిపించింది. కారు, మోటారు సైకిల్, రైలు వంటి వాహనాలకు తనదైన శైలిలో రూపమిచ్చి ప్రపంచ రికార్డులు సైతం సాధించిన సుధాకార్ తన పేరుతోనే వాటిని జనాలకు సుధా‘కార్’ బ్రాండ్తో పరిచయం చేశాడు.
టమాటా కారు, పంజరం కారు, ష్యూ కారు, బ్యాగ్ కారు ఇలా ఒక్కటేమిటి దాదాపు రెండు వందల కార్లను తానే స్వయంగా రూపొందించాడు సుధాకార్.
ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన కార్లు
కొత్తగా ఉంటే చాలు అది ఏ రంగానికి చెందినదైనా సరే ఎప్పుటికీ ఆదరణ ఉంటుంది. భిన్నంగా ఉండే వ్యక్తులు, వస్తువులకు ఆధునిక యుగమైనా ఆదరణ మాత్రం తగ్గదు. అందుకే మామూలు కార్లను తయారు చేస్తే కొత్తదనం ఏముంటుంది? ఏదైన ఓ ప్రత్యేకత ఉండాలి అనుకున్నాడు హైదరాబాద్ కు చెందిన సుధాకర్. అందుకోసం పట్టుదలతో సాధన చేశాడు.
ప్రపంచ స్థాయిలోనే అత్యంత అరుదైన వింత ఆకృతుల్లో కార్లను తయారు చేసి తన సత్తా చాటాడు. తన సృజనాత్మకతతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించగలిగాడు. రకరకాల ఆకృతుల్లో కార్లను రూపొందించి అందరినీ ఆశ్చర్య పరిచిన సుధాకర్ సాధన ఉంటే చాలు పనులన్నీ సమకూరుతాయని నిరూపిస్తున్నాడు. ఆటోమొబైల్ రంగంలోనే తన వినూత్న ప్రయోగాలతో దేశ, విదేశాల్లో ప్రశంసలు అందుకుంటున్నాడు.
అవగాహన కార్యక్రమాల్లో ఇవే కార్లు..
హైదరాబాద్ నగరంలో ఏ అవగాహనా కార్యక్రమం జరిగినా సుధాకర్ కార్లే కనిపిస్తూ ఉండేవి. ఇటీవల కరోనా వైరస్ ఆకృతిలో కారు తయారు చేసి జనాల్లో అవగాహన కల్గించే ప్రయత్నం చేసాడు. సామాజిక చైతన్యం తెచ్చేందుకు సందర్భాన్ని బట్టి ఒక్కో రూపంలో కార్లను తయారు చేసేవాడు.
ధూమపాన నిషేధం కోసం ప్రత్యేకంగా సిగరెట్ ఆకారంలో కారును తయారు చేసి ధూమపానం వల్ల కలిగే అనర్థాలను గురించి ప్రజలకు తెలియజేశాడు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘లేడీస్ హ్యాండ్ బ్యాగ్’, ‘లిప్స్టిక్’, ‘లేడీస్ ష్యూ’ వంటి ఆకృతుల్లో రూపొందించిన వాకీ కార్లు అప్పట్లో ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అంతేకాదు ఎయిడ్స్ డే రోజున పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాల్లో ‘కండోమ్’ రూపంలో కారును తయారుచేసి ఎయిడ్స్పై సమర శంఖాన్ని పూరించాడు సుధాకర్. రోడ్డు భద్రతపై అందరినీ చైతన్య పరిచేందుకు సుధాకర్ ప్రత్యేకంగా రూపొందించిన ‘హెల్మెట్’ ఆకారంలో ఉండే వాకీ కార్ నగరంలోని రోడ్లపై చక్కెర్లు కొట్టింది.
చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు
చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు వయో భేదం లేకుండా అందరి దృష్టిని ఈ వాకీ కార్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. పెన్సిల్, చాక్ మర్, ఎరేజర్ వంటి వస్తువుల రూపంలో తయారు చేసిన కార్లు చిన్నారులను అలరిస్తుంటాయి.
పలురకాల ఆకృతుల్లో రైళ్లు, బైక్లు, సైకిల్ వంటి వాహనాలను మలిచి ఎంతో మంది చేత శభాష్ అనిపించుకున్నాడు సుధాకర్. హైదరాబాద్లోనే కాకుండా, దేశంలో మరో రెండు మూడు చోట్ల్ల వాకీ కార్ల మ్యూజియాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇతర దేశాల్లో చాలా మంది ఇటువంటి వాకీకార్లను తయారు చేయమని కోరుతున్నారట.
హైదరాబాద్:రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎంతోమంది అశువులు బాశారు. ఆనాటి పోరాటం అనంతరం యుద్ధం జరిగిన ప్రదేశాల్లోని కొన్నిఅవశేషాలు మన హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నాయి. సుధాకార్ల మ్యూజియంఅధినేత సుధాకర్ “సెకండ్ వరల్డ్ వార్ కలెక్షన్”నుసేకరించారు.రెండో ప్రపంచయుద్ధ సమయంలోని జవాన్లు వాడిన సైకిళ్ళు, బైక్ లు, కుర్చీలు,మంచాలు బహదూర్ పుర లో ఉన్న సుధాకార్ల మ్యూజియంలో సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.