365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఆగస్టు 11,2025 : దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద, వాటి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధికుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలను జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు..
ఎనిమిది వారాల్లోగా ఢిల్లీలోని అన్ని వీధి కుక్కలను పట్టుకుని, వాటిని డాగ్ షెల్టర్‌లకు తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 5వేల కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
ప్రజల రక్షణ ముఖ్యం..
“రేబిస్ బారిన పడి చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలమా?” అని ప్రశ్నిస్తూ, వీధికుక్కల బెడదను తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేసింది.
ప్రతిఘటిస్తే కఠిన చర్యలు..
కుక్కలను పట్టుకుని షెల్టర్లకు తరలించే ప్రక్రియకు ఎవరైనా అడ్డుపడితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అటువంటి వారిపై కోర్టు ధిక్కార కేసు కూడా నమోదు చేయాలని పేర్కొంది.

హెల్ప్‌లైన్ ఏర్పాటు..
వీధి కుక్క కాటుకు సంబంధించిన కేసులను తక్షణమే నమోదు చేయడానికి ఒక వారంలోగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.
వాక్సినేషన్, స్టెరిలైజేషన్: వీధికుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయడానికి తగినంత సంఖ్యలో సిబ్బందిని నియమించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇది కూడా చదవండి…వర్షపు నీరు కంటికి ఎందుకు మంచిది కాదు..?
ఈ ఆదేశాలతో ఢిల్లీలో వీధికుక్కల సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు రక్షణ లభిస్తుందని ఆశిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.