365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, కాకినాడ, ఆగస్టు15, 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు నిరాటంకంగా అమలు కావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా రాష్ట్రంలో శాంతిభద్రతలు, సుస్థిర పాలన చాలా ముఖ్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కాకినాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వ చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నామని తెలిపారు.
లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి..
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. దీనికి సుస్థిర పాలన అత్యంత అవశ్యకమన్నారు. కూటమి ప్రభుత్వానికి శాంతిభద్రతల పరిరక్షణ, దేశ సుస్థిరతపై స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత, లా అండ్ ఆర్డర్ మెరుగుపడటంతో రూ. 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఉదాహరణగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లా అండ్ ఆర్డర్‌ను బలోపేతం చేసి, పెట్టుబడులను ఆకర్షిస్తామన్నారు. ఈ సుస్థిర పాలన కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు.
గత ప్రభుత్వ చీకటి రోజులు..
2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని గత పాలకులు బ్రిటీషర్ల మాదిరిగా తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అప్పట్లో రోడ్డు మీదకు రావాలంటేనే భయాలు ఉండేవని, విమర్శలు చేయాలంటే ప్రజలు, పోలీసు అధికారులు భయపడే పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు.
అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుందని, సద్విమర్శలను స్వీకరిస్తుందని తెలిపారు.
అంతర్గత శత్రువుల పట్ల అప్రమత్తత అవసరం
దేశ అంతర్గత సుస్థిరతను దెబ్బతీసే వారిపై నిఘా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓడిన ప్రతిసారీ “ఓట్ చోరీ” అని ప్రచారం చేయడం వెనుక శత్రు దేశాల కుట్ర ఉందని ఆరోపించారు.

విదేశీ శక్తుల అజెండాను మోస్తున్న అంతర్గత శత్రువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోటను బయటి నుంచి పడగొట్టడం కంటే లోపలి నుంచి తలుపు తీస్తే సులువుగా ఉంటుందని ఉదాహరణగా చెప్పారు. ఇది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు.
సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తాం..
గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శనంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు “సూపర్ సిక్స్” పథకాలను అమలు చేస్తోందని వివరించారు.
తల్లికి వందనం: ఈ పథకం కింద ఈ ఏడాది 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు జమ చేశామని తెలిపారు.
దీపం – 2: రెండు విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, వచ్చే ఐదేళ్లలో ఈ పథకం కోసం రూ. 13,423 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.
స్త్రీశక్తి: ఈ రోజు నుంచే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
కాకినాడలో క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి శ్రీకారం..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం కాకినాడ జనరల్ హాస్పిటల్‌లో రెడ్ క్రాస్ వారి సహకారంతో రూ. 6 కోట్ల నిధులతో నిర్మించనున్న క్యాన్సర్ బ్లాక్ భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు.