

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూలై 7, 2021: శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం, హిందూ ధర్మప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఒక ఆయుధం లాంటిదని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అన్నారు. ఎస్వీబీసీ 13వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఛానల్ కార్యాలయంలో నిర్వహించిన సభకు ఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కరోనా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టినా ఎస్వీబీసీ ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం లభించిందన్నారు. ప్రపంచ ప్రజల ఆరోగ్యం కోసం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల ఇళ్లకు చేర్చడంతో పాటు అనేక కొత్త కార్యక్రమాలకు ఎస్వీబీసీ శ్రీకారం చుట్టిందన్నారు. ఏడాదిన్నర కాలంగా ఎస్వీబీసీ రేటింగ్ ఉన్నత స్థానానికి వెళ్లడం గర్వకారణమన్నారు. వేదాలు సామాన్య ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో తెలియజేసే కార్యక్రమాలు ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేస్తున్నామన్నారు. తరిగొండ వెంగమాంబ సాహిత్యం ప్రజలకు చేరవేయడం ఎస్వీబీసీ ద్వారానే సాధ్యమైందని చెప్పారు.


ఛానల్ కార్యక్రమాలకు సంబంధించి ఏడాది పాటు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. వేదాలు, పురాణాలు, సంస్కృతం, గోసంరక్షణ, సేంద్రియ వ్యవసాయం లాంటి అంశాలను ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాల రూపకల్పన ఉండాలని అధికారులకు సూచించారు. మాస వైశిష్ట్య కార్యక్రమాలు పిల్లలకు తెలుగు నేర్చుకోవడానికి, పురాణాల్లో పాత్రల గురించి తెలుసుకోవడానికి, ఇతిహాసాల గురించి అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రసారం చేయడం ద్వారా హిందూ ధర్మప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించవచ్చని ఈవో అభిప్రాయపడ్డారు.


తిరుమల శ్రీ ఆంజనేయస్వామి జన్మస్థలమని పండితుల కమిటీ ప్రకటించిన అనంతరం టిటిడి తొలిసారి నిర్వహించిన హనుమజ్జయంతి కార్యక్రమాలను ఎస్వీబీసీ ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించనున్నట్టు ఈవో వివరించారు. త్వరలో హిందీ, కన్నడ ఛానళ్లను ప్రారంభిస్తామన్నారు. ఎస్వీబీసీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి అవసరమైన సహకారం అందిస్తామని ఈవో చెప్పారు.

ఛానల్ ఛైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ ఛానల్ ఎండి ధర్మారెడ్డి నాయకత్వంలో అందరి సహకారంతో ఎస్వీబీసీ అనేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ఛానల్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో సంగీత సాహిత్య ప్రధాన కార్యక్రమాలు కూడా ఎస్వీబీసీ ప్రసారం చేస్తుందని ఆయన తెలిపారు.