365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై, మార్చి 21, 2025 : ఎయిర్ న్యూజిల్యాండ్‌కి చెందిన డిజిటల్ మౌలిక సదుపాయాలను నవీకరించేందుకు, ఏఐ ఆధారిత నవకల్పనల్లో సంస్థ ముందుండేందుకు తోడ్పడేలా అంతర్జాతీయ ఐటీ సేవలు, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అయిదేళ్ల భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

ఎయిర్ న్యూజిల్యాండ్ డిజిటల్ సామర్థ్యాలను, కస్టమర్ల అనుభూతులను, అలాగే ఫ్లీట్ మేనేజ్‌మెంట్, సిబ్బంది షెడ్యూలింగ్, గ్రౌండ్ సర్వీసులు సహా వ్యాపారానికి సంబంధించిన వివిధ అంశాల్లో నిర్వహణ సామర్ధ్యాలను మెరుగుపర్చడం ఈ ఒప్పంద లక్ష్యంగా ఉంటుంది.

ముంబైలోని టీసీఎస్ బన్యన్ పార్క్ క్యాంపస్‌లో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాల కార్యక్రమం నిర్వహించబడింది. డిజిటల్‌గా ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎయిర్‌లైన్‌గా మారాలన్న ఎయిర్ న్యూజిల్యాండ్ లక్ష్య సాకారానికి ఇది తోడ్పడనుంది. న్యూజిల్యాండ్ ప్రధాన మంత్రి శ్రీయుత క్రిస్టొఫర్ లక్సన్, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఎయిర్ న్యూజిల్యాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రెగ్ ఫొరాన్, టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

న్యూజిల్యాండ్‌లో వివిధ పరిశ్రమలవ్యాప్తంగా గత 37 సంవత్సరాలుగా ఆవిష్కరణలకు తోడ్పాటునిస్తూ, డిజిటల్ పరివర్తనకు సంబంధించి విశ్వసనీయమైన భాగస్వామిగా టీసీఎస్‌ ఉంటోంది. న్యూజిల్యాండ్ పట్ల టీసీఎస్ నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది.

ఆక్లాండ్‌లోని కార్యాలయంలో 460 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్‌తో ప్రాంతీయంగా బ్యాంకింగ్, రిటైల్, నిర్మాణ, తయారీ, లోకల్ గవర్నమెంట్‌వ్యాప్తంగా 20 పైగా బ్లూ చిప్ కస్టమర్లకు సంస్థలు సేవలు అందిస్తోంది. సైబర్‌సెక్యూరిటీ, సస్టైనబిలిటీ, ఏఐలో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు టీసీఎస్ కో-ఇన్నోవేషన్ నెట్‌వర్క్TM (COIN™) ద్వారా న్యూజిల్యాండ్‌లోని అగ్రగామి విశ్వవిద్యాలయాలతో సంస్థ కలిసి పని చేస్తోంది.

సుస్థిర డిజిటల్ పరివర్తన విషయంలో ప్రాంతీయంగా నిర్దిష్ట విధానాలను తీర్చిదిద్దే క్రమంలో 2022లో ఆసియా పసిఫిక్ డిజిటల్ సస్టైనబిలిటీ ఇండెక్స్‌ అభివృద్ధికి టీసీఎస్ సారథ్యం వహించింది. వ్యాపార పరిధికి మించి, న్యూజిల్యాండ్‌లో డిజిటల్ టాలెంట్‌ను పెంపొందించడానికి కూడా టీసీఎస్ కట్టుబడి ఉంది.

సంస్థకు చెందిన ఫ్లాగ్‌షిప్ STEM సాధికారత ప్రోగ్రాంలైన goITTMand goITTM Girls ద్వారా ప్రాంతీయంగా టెక్నాలజీ, నవకల్పనల్లో కెరియర్లను ఎంచుకునేలా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి.

“’అధునాతన సాంకేతికతల్లో టీసీఎస్ అనుభవాన్ని ఉపయోగించుకోవడమనేది కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు, కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకునేందుకు, సైబర్‌సెక్యూరిటీ మరియు డేటా భద్రతపై మా నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు తోడ్పడుతుంది.

భవిష్యత్ తరపు డిజిటల్ ఆధారిత ఎయిర్‌లైన్‌గా ఎదగాలన్న మా లక్ష్య సాధనకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది. 2024 సెప్టెంబర్‌లో మేము టీసీఎస్‌తో కలిసి పని చేయడం ప్రారంభించాం. డిజిటల్ సొల్యూషన్స్ విషయంలో వారికున్న ప్రతిభ, అనుభవం ప్రయోజనాలు మాకు కొద్ది నెలల వ్యవధిలోనే కనిపించాయి.

రాబోయే రోజుల్లో మా కార్గో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లోను, మా డిజిటల్ రిటైల్ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలోను తోడ్పాటు అందిస్తూ టీసీఎస్ కీలక భాగస్వామిగా ఉండనుంది.

మా కస్టమర్లు, అలాగే ఏవియేషన్ పరిశ్రమకు ఈ భాగస్వామ్యం ద్వారా గణనీయంగా ప్రయోజనాలు చేకూరగలవని భావిస్తున్నాం” అని ఎయిర్ న్యూజిల్యాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రెగ్ ఫొరాన్ (Greg Foran) తెలిపారు.

“డిజిటల్‌గా అత్యంత అధునాతన ఎయిర్‌లైన్‌గా ఎదిగే దిశగా సాగే ఎయిర్ న్యూజిల్యాండ్ ప్రస్థానంలో భాగం కావడం మాకు సంతోషకరమైన విషయం. భారీ స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాలకు ఏవియేషన్‌లో అపార అనుభవం దన్నుతో సమర్ధత, సస్టైనబిలిటీ, కస్టమర్ ఎంగేజ్‌మెంట్‌లో ఎయిర్ న్యూజిల్యాండ్ కొత్త ప్రమాణాలు నెలకొల్పడంలో టీసీఎస్ తోడ్పడుతుంది.

ఏఐ, ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగించి కార్యకలాపాలు, ప్యాసింజర్ల అనుభవాలను మెరుగుపర్చడం, అలాగే ఎయిర్‌లైన్‌ను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం మా లక్ష్యాలు. టెక్నాలజీ ద్వారా వృద్ధి చెందడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనూ గ్లోబల్ కంపెనీలకు సహాయం అందించడంలో మాకున్న నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది” అని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ తెలిపారు.

ఎయిర్ న్యూజిల్యాండ్ గ్లోబల్ నెట్‌వర్క్ దేశీయంగా, అంతర్జాతీయంగా 49 గమ్యస్థానాలకు ఎయిర్ ప్యాసింజర్, కార్గో సర్వీసులను అందిస్తోంది. కంపెనీ ప్రతి సంవత్సరం 3,400 పైచిలుకు వీక్లీ ఫ్లయిట్లతో 1.5 కోట్ల మంది పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులకు సురక్షితమైన, వినూత్నమైన, టెక్నాలజీ ఆధారితమైన అనుభూతులను అందించాలన్న ఎయిర్ న్యూజిల్యాండ్‌ లక్ష్య సాధన దిశగా ఈ పరివర్తన ఒక కీలకమైన ముందడుగు కాగలదు.

ఏఐ ఆధారిత ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలను, క్రిటికల్ ఎయిర్‌లైన్ కార్యకలాపాలకు అనుసంధానించడం ద్వారా 600 పైచిలుకు అప్లికేషన్లున్న ఎయిర్‌ న్యూజిల్యాండ్ డిజిటల్ సర్వీసులను టీసీఎస్ క్రమబద్ధీకరిస్తుంది.

కార్గో సర్వీసులు, మేనేజ్‌మెంట్, రిటైల్ ఆఫరింగ్‌లు, మెయింటెనెన్స్ సిస్టంలు, సిబ్బంది కార్యకలాపాలవ్యాప్తంగా ఇది కొత్త ఆవిష్కరణలకు దోహదపడగలదు.

ఈ భాగస్వామ్యం కింద సిబ్బంది పరివర్తన కూడా కీలకాంశంగా ఉండనుంది. టీసీఎస్‌కి చెందిన విస్తృత స్థాయి అప్‌స్కిలింగ్ ప్రోగ్రాంలు, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, డిజిటల్ ఇంజినీరింగ్ అంశాల్లో ఎయిర్ న్యూజిల్యాండ్ సిబ్బంది సామర్థ్యాలను మెరుగుపర్చనున్నాయి. ఎయిర్ న్యూజిల్యాండ్ డిజిటల్ రిటైల్, లాయల్టీ ప్రోగ్రాం అనుభవాలను కూడా మెరుగుపర్చేందుకు కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది.

ఏవియేషన్‌లో మూడు దశాబ్దాలుగా అగ్రగామిగా ఉంటున్న టీసీఎస్‌కు, అంతర్జాతీయంగా దిగ్గజ విమానయాన సంస్థలతో భాగస్వామ్యాలు ఉన్నాయి. కన్సల్టింగ్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ సర్వీసులు మొదలైనవి అందిస్తోంది. ఇంటెలిజెంట్ ఎయిర్‌లైన్ కార్యకలాపాల కోసం నిర్దిష్ట పరిశ్రమకు చెందిన TCS Aviana™ లాంటి అటానామస్, డిజిటల్, క్లౌడ్ రెడీ ప్లాట్‌ఫాంను ఉపయోగిస్తోంది.

టీసీఎస్‌కి విమానయాన సంస్థల కార్యకలాపాలపై అపార అవగాహన ఉండటంతో పాటు ఏఐ ఆధారిత సాంకేతిక సామర్థ్యాలు కూడా ఉండటమనేది ఎయిర్ న్యూజిల్యాండ్ తమ వ్యాపార వ్యవస్థవ్యాప్తంగా నవకల్పనలను ఆవిష్కరించేందుకు, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహాయకరంగా ఉండనుంది.