365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2,2025: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే లక్షలాది మంది ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు తాజా తీర్పు పెద్ద సవాల్‌గా మారింది.

ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, టీచర్స్‌గా కొనసాగాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) తప్పనిసరిగా పాస్ కావాలి. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

తీర్పు ముఖ్యాంశాలు..

TET తప్పనిసరి: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరూ రెండేళ్లలోపు టీఈటీ పరీక్షలో అర్హత సాధించాలి. లేకపోతే వారి ఉద్యోగం పోతుంది.

పాత టీచర్లకు కూడా వర్తిస్తుంది: ఈ తీర్పు విద్యా హక్కు చట్టం (RTE) అమలులోకి రాకముందు నియమితులైన ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుంది.

పదోన్నతికి కూడా అవసరం: ఒకవేళ ఉపాధ్యాయులకు పదోన్నతి కావాలంటే, వారు తప్పనిసరిగా టీఈటీ పాస్ కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఐదేళ్ల లోపు పదవీ విరమణ చేయనున్న వారికి టీఈటీ మినహాయింపు ఇచ్చింది.

ఎవరు ప్రభావితమవుతారు..?

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులందరూ ఈ తీర్పు పరిధిలోకి వస్తారు. ముఖ్యంగా, 2011లో టీఈటీ మార్గదర్శకాలు అమల్లోకి రాకముందు ఉద్యోగంలో చేరిన లక్షలాది మంది టీచర్లు దీనివల్ల ప్రభావితమవుతారు.

పునఃపరిశీలన పిటిషన్..

సుప్రీంకోర్టు తీర్పుపై పలు ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆలోచిస్తున్నట్లు యూపీకి చెందిన ఉపాధ్యాయుల తరఫున వాదించిన న్యాయవాది రాకేష్ మిశ్రా తెలిపారు.

ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు వర్తిస్తుంది కాబట్టి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. అంతేకాకుండా, టీఈటీ పాస్ కావడానికి ఇచ్చిన రెండేళ్ల సమయాన్ని పెంచాలని కూడా వారు కోర్టును అభ్యర్థించనున్నారు.

భవిష్యత్తులో ఏం జరగనుంది..?

ఉపాధ్యాయులకు టీఈటీ తప్పనిసరి కావడం వల్ల వారికి కొత్త సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చాలా ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు మళ్లీ పరీక్ష రాయడం కష్టం కావచ్చు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు కలిసికట్టుగా తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.