365తెలుగు డాట్ కామ్, ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ 21,డిసెంబర్ 2020:ఆదిత్య మెహతా ఫౌండేషన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్తాధ్వర్యంలో “ఇన్ఫినిటీ రైడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. “ఇన్ఫినిటీ రైడ్ -2020” పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్ నిర్వహించనున్నారు. 45రోజుల పాటు కొనసాగనున్నఈ రైడ్ హైదరాబాద్ నగరానికి చేరుకున్నది. ఫ్లాగ్ ఆఫ్ సెర్మనీ సికింద్రాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె “ఇన్ఫినిటీ రైడ్ -2020″ను జెండా ఊపీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తోపాటు టాలీవుడ్ హీరోయిన్లు రెజీనా ,మంచు లక్ష్మీలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పారా సైక్లిస్టులు హైదరాబాద్ నుంచి బయలుదేరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి మొదలుకానున్న ఆఖరి దశ ఇన్ఫినిటీ రైడ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మీదుగా 1279కిలో మీటర్లు ప్రయాణించి గమ్యస్థానమైన కన్యాకుమారికి ఈనెల 31న చేరుకోనుంది. మొత్తం 36 నగరాల గుండా 45 రోజుల పాటు జరిగే రైడ్ ద్వారా నిధులను కూడా సేకరించనున్నారు.

“పారా అథ్లెట్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఆదిత్యా మెహతా “ఫౌండేషన్(ఏఎమ్ఎఫ్) చేస్తున్నకృషిని ఈ సందర్భంగా నేను ప్రశంసిస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత నేను పాల్గొన్నతొలి కార్యక్రమం ఇది. అద్భుత ప్రతిభ దాగున్న దివ్యాంగులకు మద్దతుగా నిలువాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఏ విషయంలోనూ వారు ఎవరికీ తీసిపోరు. వైకల్యాన్నిఅధిగమిస్తూ ఎంచుకున్న క్రీడలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలనే ఆత్మవిశ్వాసం మన కంటే వారిలోనే మెండుగా ఉంటుంది. ఏఎమ్ఎఫ్అకాడమీలో శిక్షణ వసతులు, సౌకర్యాలు చాలా బాగున్నాయి. దివ్యాంగులను చేరదీసి శిక్షణ ఇస్తున్నతీరు చాలా బాగుంది. ఈ విషయంలో ఏఎమ్ఎఫ్ చేస్తున్నకృషి అభినందనీయం” అని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు.