Tomcom

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జనవరి 3,2023: తెలంగాణ ప్రభుత్వ టామ్‌కామ్‌, నావిస్ హ్యూమన్ రిసోర్సెస్ మొదటి బ్యాచ్‌ కోర్సు ప్రారంభమైంది.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ విదేశాలలో ఉపాధి అవకాశాలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో ఇప్పటికే టామ్‌కామ్ ఇరవై దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ టామ్‌కామ్‌తో నావిస్ హ్యూమన్ రిసోర్సెస్ చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా ప్రారంభమైన మొదటి బ్యాచ్ అభ్యర్దులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘విదేశాలలో ఉపాధి అవకాశాలను దక్కించుకునేందుకు మొదటిగా అక్కడి భాషను నేర్చుకోవలసిన అవసరం ఉంది.

ఇప్పటికే వందలాది మంది విదేశీ భాషలను నేర్చుకున్నారు. నేర్చుకు నేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. జపనీస్ భాషను అధికారికంగా నేర్పించేందుకు నావిస్ సంస్థ తీసుకుంటున్న చొరవ ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు.

భాషను సంకోచం లేకుండా నేర్చుకోవాలి. మొదట అర్థం చేసుకుని మాట్లాడడం ప్రారంభిస్తే, వ్యాకరణ దోషాలను తదుపరి దశలలో సరి చేసుకోవచ్చు. అనంతపురంలో పలువురు విద్యార్థులు తెలుగుతో పాటు స్పానిష్ బాషను నేర్చుకుంటున్నారు.

ఆ భాషను నేర్చుకునేందుకు అక్కడి ఆర్‌డీటీ సంస్థ ప్రోత్సహిస్తోంది. భాషపై పట్టు సాధిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మొదటి బ్యాచ్‌కు ఎంపికైన వారు భాషను నేర్చుకోవడమే లక్ష్యంగా వ్యవహరించండి.

మొదటి బ్యాచ్ విజయవంతమైతే మరికొన్ని బ్యాచ్‌లు ముందుకు వస్తాయి. ముఖ్యమంత్రి తీసుకున్న చొరవతో, అనుకున్న రెండు నెలలలోనే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

లక్ష్యాలను నిర్దేశించుకుని విదేశీ ఉపాధి అవకాశాలను పొందేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాము
అని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

మొదటి బ్యాచ్‌లో వెళుతున్న మీరంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా, రాయబారులా వెళుతున్నారు. విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చే అభ్యర్థులను గౌరవంగా చూసుకునే దేశాలకు ఉద్యోగులను పంపించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

Tomcom

తెలంగాణ ప్రభుత్వానికి ఖ్యాతి తీసుకురండి. నావిస్ ఉత్తమ కంపెనీ. మంచి నెట్‌వర్క్ ఉంది. ఫిబ్రవరి చివరి నాటికి మీకు అపాయింట్‌మెంట్ లెటర్ అందుకోవాలి’’ అని అభ్యర్థులకు ధైర్యం ఆయన చెప్పారు.

‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాలతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలోని నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, పారామెడికల్ సిబ్బందికి విదేశీ ఉపాధి అవకాశాలను అందుకోవడం సులభం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ పైలట్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.

జపాన్, అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాలకు నైపుణ్యం ఉన్న అభ్యర్థులను పంపించేందుకు టామ్ కామ్ సహకరిస్తుంది’’ అని ఆయన వివరించారు.

మొదటి బ్యాచ్‌లో పలు వడబోత ప్రక్రియల అనంతరం తెలంగాణకు చెందిన 25 మంది నర్సులు ఎంపికయ్యారు. శిక్షణకు ఎంపికైన నర్సులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు, తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, నావిస్ సీఈఓ టకాకో ఒషిబుచి మార్గదర్శనం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని మాట్లాడుతూ, ‘‘వచ్చే ఏడాది మార్చి నాటికి తెలంగాణ నుంచి కనీసం 500 మంది నర్సులను జపాన్‌కు పంపించాలన్న లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. మొదటి బ్యాచ్‌కు శిక్షణ పూర్తయ్యే నాటికి కనీసం వెయ్యి మంది ముందుకు వస్తారన్న నమ్మకం ఉంది.

రానన్న రోజుల్లో ఈ సంఖ్య ఐదు వేలకు చేరుకుంటుందన్న నమ్మకం ఉంది. బెంగళూరుతో పోల్చితే, తెలంగాణ నుంచి చక్కని స్పందన లభిస్తోంది. సురక్షితమైన ఉపాధి అవకాశాలను ఇచ్చే దేశాలతోనే ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ప్రతి జిల్లా నుంచి విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి ఉన్న అర్హులకు మద్దతు ఇచ్చేందుకు టామ్‌కామ్, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తున్నాయి.

రెండు నెలల్లోనే జపనీస్‌ను నేర్చుకునుందుకు అవకాశం ఉంది. భాష నేర్చుకున్న వెంటనే నావిస్ సంస్థ ఉద్యోగ నియామక పత్రాన్ని అందిస్తుంది. ఇది క్యాంపస్ సెలక్షన్‌’’ అని ఆమె పేర్కొన్నారు.

నావిస్ సీఈఓ టకాకో ఒషిబుచి (Takako Oshibuchi) మాట్లాడుతూ, ‘‘తెలంగాణ ప్రభుత్వం, టామ్‌కామ్‌ల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాము.

వృత్తి నిపుణులైన బోధకులు మా వద్ద ఉన్నారని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే జపాన్‌లో 1‌00కు పైగా భారతీయ నర్సులకు శిక్షణ ఇచ్చాము. తెలంగాణతో ప్రారంభించిన ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. జపాన్‌ భాష, సంస్కృతి, నైపుణ్యాలను నేర్పిస్తాము. NAVIS గర్వంగా ఉంది.

శక్తివంతమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఈ ఒప్పందం ద్వారా ఒక గొప్ప ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు అవకాశం కలిగింది’’ అని వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం.రిజ్వీ, ఐఎఫ్‌ఎస్‌ ప్రత్యేక కార్యదర్శి (పరిశ్రమల శాఖ) ,టామ్‌కామ్‌ సీఈఓ డాక్టర్‌ ఇ.విష్ణు రెడ్డి,

ముఖ్యమంత్రికి ఆరోగ్య విభాగానికి చెందిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డాక్టర్‌ గంగాధర్‌, వైద్య విద్య శాఖ డైరెక్టర్‌ డా.రమేష్‌ రెడ్డి, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్ ,ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.