365తెలుగుడాట్ కామ్ హైదరాబాద్, డిసెంబర్ 22,2025 : తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ (G.O.Ms.No.252) ను ఖరారు చేసింది. ఈ కొత్త నిబంధనల ద్వారా అటు డిజిటల్ మీడియాకు, ఇటు క్షేత్రస్థాయి రిపోర్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం నిర్దేశించింది.

నిబంధనల్లోని ప్రధానాంశాలు ఇవే..

  1. కార్డుల విభజన – ఉపయోగాలు: ప్రభుత్వం కార్డులను రెండు రకాలుగా వర్గీకరించింది. రిపోర్టింగ్‌ చేసే వారికి ‘అక్రెడిటేషన్ కార్డు’ జారీ చేస్తారు. ఇది వార్తా సేకరణకు గుర్తింపుగా ఉపయోగపడుతుంది. ఇక డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే ‘మీడియా కార్డు’ కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు మాత్రమే పరిమితం కానుంది.
  2. డిజిటల్ మీడియాకు ప్రాధాన్యత: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా డిజిటల్ మీడియా కోసం ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. అక్రెడిటేషన్ పొందే వెబ్‌సైట్‌లకు గత ఆరు నెలల్లో సగటున నెలకు 5 లక్షల మంది విజిటర్స్ ఉండాలని నిబంధన విధించారు. ఒక డిజిటల్ మీడియా సంస్థకు గరిష్టంగా 10 కార్డులు మాత్రమే మంజూరు చేస్తారు.
  3. విద్యార్హతలు – అనుభవం:

రాష్ట్ర స్థాయి: డిగ్రీ లేదా ఐదేళ్ల అనుభవం తప్పనిసరి.

నియోజకవర్గ/మండల స్థాయి: కనీసం ఇంటర్మీడియట్ విద్యార్హత ఉండాలి.

వెటరన్ జర్నలిస్టులు: 30 ఏళ్ల అనుభవం కలిగి ఉండి, 58 ఏళ్లు నిండిన సీనియర్ జర్నలిస్టులు వెటరన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు.

  1. పత్రికలు – ఛానళ్ల అర్హత..

దినపత్రికలకు PRGI రిజిస్ట్రేషన్ ఉండటంతో పాటు కనీసం 2,000 ప్రతులు పంపిణీ కావాలి.

శాటిలైట్ ఛానళ్లలో 50% వార్తా కంటెంట్ ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులెటిన్లు ప్రసారం చేయాలి.

కమిటీల కాలపరిమితి – నిర్మాణం..
రాష్ట్ర స్థాయి (SMAC), జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలాన్ని రెండేళ్లుగా నిర్ణయించారు. రాష్ట్ర కమిటీకి మీడియా అకాడమీ చైర్మన్ నేతృత్వం వహించనుండగా, జిల్లా కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌లుగా వ్యవహరిస్తారు.

నిబంధనల ఉల్లంఘనపై హెచ్చరిక..అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారంతో కార్డులు పొందినా వాటిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కావాలంటే రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు రాష్ట్రంలోని జర్నలిస్టుల పనితీరులో మరింత పారదర్శకతను తీసుకువస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.