*17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ
*ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ
*హైదరాబాద్ లోనే హెడాఫీస్..మెయిన్ క్యాంపస్
*బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టే యోచన
*నిధులకు రాజీ పడేది లేదు.. ఉపాధి కల్పించటమే లక్ష్యం
*ముసాయిదాకు పలు మార్పులు సూచించిన సీఎం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 19,2024:తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థినీ విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు.
ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు, నిర్వహణకు ఎంత ఖర్చు అయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
స్కిల్ యూనివర్సిటీపై సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, హర్యానాలో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను పరిశీలించి, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల విభాగం నమూనా ముసాయిదాను తయారు చేసింది.
ఈ యూనివర్సిటీలో నిర్వహించే కోర్సులు, వాటి వ్యవధి, నిర్వహణకు అవసరమయ్యే మౌలిక వసతులు, నిర్వహణకు అవసరమయ్యే నిధులు, వివిధ కంపెనీల భాగస్వామ్యంపై పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు.
కొత్త యూనివర్సిటీకి ‘తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ’ అని పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో (పీపీపీ మోడల్లో) స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పుతారు. లాభాపేక్ష లేకుండా స్వయం ప్రతిపత్తి ఉండేలా దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు నాలుగేండ్ల కాల వ్యవధి ఉండే డిగ్రీ కోర్సులతో పాటు ఏడాది డిప్లొమా, మూడు నుంచి నాలుగు నెలల వ్యవధి ఉండే సర్టిఫికెట్ కోర్సులు ఇందులో నిర్వహిస్తారు.
తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు. ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్..తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడుతారు.
ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి, క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
హైదరాబాద్ లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ క్యాంపస్ తో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ ప్రాంగణాలు (శాటిలైట్ క్యాంపస్లు) ఏర్పాటు చేయాలనే చర్చ జరగింది. జిల్లా కేంద్రాల్లో శాటిలైట్ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తే.. వాటిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని, అందరూ హైదరాబాద్ క్యాంపస్ లో చేరేందుకు పోటీ పడుతారని ముఖ్యమంత్రి అన్నారు.
అందుకే హైదరాబాద్ లోనే అందరికీ శిక్షణను అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఈఎస్సీతో పాటు న్యాక్ క్యాంపస్ ఉపయోగించుకోవాలని, అవసరమైన మౌలిక వసతి సదుపాయాలుండే వివిధ ప్రాంగణాలను గుర్తించాలని సూచించారు. భూదాన్ పోచంపల్లిలో ఉన్న స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న సదుపాయాలను అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, అటువంటి కోర్సుల్లో ఎక్కువ సీట్లు ఉండాలని చెప్పారు.
ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని, ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మిగతా యూనివర్సిటీలు అనుసరించిన విధానాలను పరిశీలించి కొత్త యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేసి ముసాయిదాను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
Also Read: MAHILA DAKSHATA SAMITHI AND BANSILAL COLLEGE OF NURSING CELEBRATES CONVOCATION OF THE 3RD BATCH OF NURSING STUDENTS
Also Read: Day 5 – 15th Monsoon Regatta 2024
ఇదికూడా చదవండి:ఐస్ మ్యాజిక్ ప్రో గ్లాస్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణిని విడుదల చేసిన వర్ల్‌పూల్ (Whirlpool) ఆఫ్ ఇండియా..
Also Read:Whirlpool of India launches Ice Magic Pro Glass Door Refrigerator Range
Also Read:Global Star Ram Charan becomes the first Indian celebrity to be awarded the Ambassador for Indian Art & Culture at the Indian Film Festival of Melbourne
ఇదికూడా చదవండి:30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే ల్యాప్‌టాప్స్..
Also Read:Bank of India Celebrates Kisan Divas with Special Initiatives for Farmers