365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఆగస్టు 17, 2025: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

వాతావరణ విశ్లేషణ (ఈరోజు ఉదయం 08:30 ఆధారంగా):

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు ఉదయం 08:30 గంటలకు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాలకు సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది.

దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 9.6 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉంది.

ఈ అల్పపీడనం రాగల 24 గంటలలో వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఈనెల 19వ తారీఖు మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉంది.

నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ దాని పరిసరాల్లో కొనసాగిన అల్పపీడన ప్రాంతం ఈరోజు ఉదయం 5:30 గంటలకు విదర్భ దాని పరిసరాలలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉంది.

ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి క్రమేపీ బలహీనపడి ఆ తర్వాత ఈనెల 18వ తారీఖు నాటికి గుజరాత్ ప్రాంతానికి ఉపరితల ఆవర్తనంగా చేరుకునే అవకాశం ఉంది.

ఋతుపవన ద్రోణి ఈరోజు జైసల్మేర్, ఉదయపూర్, రట్లాం, విదర్భ దాని పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం, జగదల్పూర్ అటు నుండి తూర్పు ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది.

తూర్పు పశ్చిమ ద్రోణి ఈరోజు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ గుజరాత్ కొంకన్ ఉత్తర మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లోని అల్పపీడన ప్రాంతం, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం కేంద్రం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 నుంచి 5.8 కి.మీ. మధ్యలో కొనసాగుతూ ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిశకు వాలి ఉంది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన..

ఈరోజు, రేపు,ఎల్లుండి: రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు..

ఈరోజు: రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రేపు: రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఎల్లుండి: రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఈరోజు, రేపు, ఎల్లుండి: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.